Raja Saab | హారర్ కామెడీ మిశ్రమంగా తెరకెక్కుతున్న రిబెల్ స్టార్ ప్రభాస్ సినిమా ‘ది రాజా సాబ్’ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొల్పుతోంది. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో వింటేజ్ ప్రభాస్ కామెడీ టైమింగ్, డార్లింగ్ ప్రభాస్ స్టైల్ ప్రేక్షకులకి పిచ్చెక్కిస్తుందని దర్శకుడు ఇప్పటికే హింట్ ఇచ్చారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, టీజర్లతో మంచి బజ్ క్రియేట్ అయిన ఈ సినిమాకు ట్రైలర్ విడుదలకు రంగం సిద్ధమైంది. తాజాగా చిత్ర బృందం అధికారికంగా ప్రకటించిన సమాచారం ప్రకారం, ‘ది రాజా సాబ్’ ట్రైలర్‌ను సెప్టెంబర్ 29వ తేదీ సోమవారం సాయంత్రం 6 గంటలకు విడుదల చేయనున్నారు.
ఇది కేవలం డిజిటల్ రిలీజ్ మాత్రమే కాకుండా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ఎంపిక చేసిన థియేటర్లలో స్పెషల్ స్క్రీనింగ్ కూడా ప్లాన్ చేసినట్లు సమాచారం. ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో ట్రైలర్ మరింత హైప్ క్రియేట్ చేయనుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఇక ఈ ట్రైలర్ మరో హైలైట్ ఏమిటంటే… అక్టోబర్ 2న థియేటర్లలో విడుదల అవుతున్న ‘కాంతార: ఏ లెజెండ్’ సినిమాతో పాటు స్క్రీనింగ్ చేయనున్నారు. రిషబ్ శెట్టి హీరోగా నటించి, దర్శకత్వం వహించిన ఈ పాన్ ఇండియా సినిమాతో ‘ది రాజా సాబ్’ ట్రైలర్ థియేటర్లో ప్రేక్షకులను అలరించనుంది.
ఇక ప్రభాస్ పుట్టినరోజు (అక్టోబర్ 23) ను పురస్కరించుకుని, ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్‌ను రిలీజ్ చేయడానికి కూడా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ ఇప్పటికే ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించనుండగా, ప్రభాస్ శీను, సప్తగిరి, వీటీవీ గణేష్ వంటి హాస్య నటులు సినిమాకు మరింత ఎంటర్టైన్మెంట్ను అందించనున్నారు. చిత్రానికి మ్యూజిక్ ఎస్.ఎస్. తమన్ అందిస్తున్నారు. మొత్తం మీద డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వస్తున్న ‘ది రాజా సాబ్’ ట్రైలర్ విడుదలపై సినీ ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది.