Raja Saab | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ‘ది రాజా సాబ్’ విడుదలకు సిద్ధమవుతోంది. రొమాంటిక్ హారర్ కామెడీ ఫాంటసీగా రూపొందుతున్న ఈ సినిమా 2026 సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. సినిమాపై ఉన్న భారీ అంచనాల నేపథ్యంలో భారత్‌లో ఒక రోజు ముందుగానే, జనవరి 8న పెయిడ్ ప్రీమియర్స్ నిర్వహించనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ చిత్ర ప్రమోషన్లలో భాగంగా ఈ రోజు సాయంత్రం 5 గంటల నుంచి హైదరాబాద్‌లో ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది.
ఈ వేడుకలో సినిమాకు సంబంధించిన సరికొత్త ట్రైలర్‌ను విడుదల చేసే అవకాశం ఉందన్న ప్రచారం సినీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ముఖ్యంగా ఈ ఈవెంట్‌కు ప్రభాస్ స్వయంగా హాజరవుతారా? లేదా? అన్నది అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠను పెంచుతోంది. ప్రభాస్ నుంచి కొద్దిరోజులుగా పెద్ద పబ్లిక్ అపియరెన్స్ లేకపోవడంతో, ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ మరింత ప్రత్యేకంగా మారనుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ కథానాయికలుగా నటిస్తుండగా, బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్‌ను సరికొత్త వింటేజ్ లుక్‌లో చూపించబోతుండటం మరో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
మొత్తంగా రొమాన్స్, హారర్, కామెడీ అంశాల సమ్మేళనంగా తెరకెక్కుతున్న ‘ది రాజా సాబ్’తో ప్రభాస్ మరోసారి ప్రేక్షకులను అలరించనున్నాడన్న నమ్మకం ట్రేడ్ వర్గాల్లో బలంగా వ్యక్తమవుతోంది. సంక్రాంతి బరిలో ఈ సినిమా ఎలాంటి సంచలనాన్ని సృష్టిస్తుందో చూడాల్సిందే.కాగా, ప్రభాస్ ఈ మధ్య వరుస సక్సెస్‌లతో దూసుకుపోతున్నాడు. సలార్, కల్కి వంటి చిత్రాలు ప్రభాస్‌కి మంచి మైలేజ్ తెచ్చిపెట్టాయి. ఇక ఇప్పుడు రాజా సాబ్ చిత్రంతో మరో మంచి హిట్ కొట్టడం ఖాయమని అంటున్నారు.