Raja Saab | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దర్శకుడు మారుతి కాంబోలో రూపొందుతున్న మోస్ట్ అవెయిటెడ్ హారర్ కామెడీ థ్రిల్లర్ ‘ది రాజా సాబ్’ పై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. సంక్రాంతి కానుకగా జనవరి 9న వరల్డ్ వైడ్‌గా విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమాపై ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, పాటలు భారీ హైప్ క్రియేట్ చేశాయి. వింటేజ్ ప్రభాస్‌ను మళ్లీ వెండితెరపై చూడబోతున్నామనే ఉత్సాహంతో ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా, ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ డీల్‌పై తాజాగా ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ ‘ది రాజా సాబ్’ నాన్-థియేట్రికల్ బిజినెస్ గురించి స్పందించారు. నెల రోజుల క్రితమే ఓటీటీ డీల్ ఫైనల్ అయిందని, అయితే తాము ఊహించిన స్థాయిలో డీల్ జరగలేదని తెలిపారు.
“ది రాజా సాబ్ ఓటీటీ డీల్ ముగిసింది. కానీ మేము అనుకున్నంత వసూళ్లు రాలేదు. ప్రస్తుతం ఓటీటీ మార్కెట్ ఇలానే ఉంది” అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక డిజిటల్ రైట్స్ విషయానికొస్తే, మొదట ఈ సినిమా హక్కులను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంటుందనే ప్రచారం సాగింది. కానీ అనూహ్యంగా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియో హాట్‌స్టార్ ఈ మూవీ డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్నట్లు సమాచారం. అప్పట్లో పాన్ ఇండియా భాషలు కలిపి దాదాపు రూ.170 కోట్ల డీల్ జరిగిందని టాక్ నడిచింది. అయితే నిర్మాత వ్యాఖ్యలతో అసలు డీల్ ఎంతకు పూర్తయిందనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.
నాన్-థియేట్రికల్ బిజినెస్ కొంత తక్కువగా జరిగినా, థియేట్రికల్ బిజినెస్ మరియు బాక్సాఫీస్ వసూళ్లు మాత్రం రికార్డు స్థాయిలో ఉంటాయని మూవీ టీమ్ నమ్మకం వ్యక్తం చేస్తోంది. ప్రభాస్ మార్కెట్, సంక్రాంతి సీజన్ అడ్వాంటేజ్ కలిసి సినిమాకు భారీ ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 27న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ వేడుకకు ప్రభాస్ కూడా హాజరవుతారని సమాచారం. చాలా రోజుల తర్వాత ప్రభాస్ అభిమానుల ముందుకు రావడంతో ఈ ఈవెంట్‌పై కూడా భారీ క్రేజ్ ఏర్పడింది. ఈ వేదికపైనే మరో ట్రైలర్‌ను విడుదల చేసే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. మొత్తానికి, ఓటీటీ డీల్‌పై చర్చలు జరుగుతున్నప్పటికీ, థియేటర్లలో ‘ది రాజా సాబ్’ ప్రభాస్ అభిమానులకు పండుగ తీసుకొస్తుందని అంటున్నారు.