Raja Saab | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న క్షణం వచ్చేసింది. యంగ్ రెబల్ స్టార్ నటిస్తున్న ‘ది రాజా సాబ్’ రిలీజ్ ట్రైలర్ విడుదలై, సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ‘డార్లింగ్’ తర్వాత ప్రభాస్‌ను ఫుల్ ఫన్ మోడ్‌లో చూసేందుకు వెయిట్ చేసిన అభిమానులకు ఈ ట్రైలర్ నిజంగా ఫుల్ ట్రీట్ ఇచ్చిందనే చెప్పాలి. ట్రైలర్ “నానమ్మ… ఈ ప్రపంచంలో నీకు అన్నీ మర్చిపోయే రోగం ఉన్నా, ఆయన్ను మాత్రం అస్సలు మర్చిపోలేవు” అనే ప్రభాస్ డైలాగ్‌తో మొదలవుతూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇది నానమ్మ – మనవడి కథ అని ప్రభాస్ ఇప్పటికే వెల్లడించగా, ట్రైలర్లో కూడా అదే ఎమోషన్ బలంగా కనిపిస్తోంది. అద్భుతమైన విజువల్స్, ప్రభాస్ వింటేజ్ లుక్ అభిమానులకు గూస్బంప్స్ తెప్పిస్తున్నాయి.
ఇప్పటివరకూ చూడని స్టైల్లో ప్రభాస్ కనిపించడమే కాకుండా, ఆయనను పవర్ఫుల్ ఆత్మ ఆవహించినప్పుడు ఎలా ఉంటుందో కూడా ట్రైలర్లో ఆసక్తికరంగా చూపించారు. కథ విషయానికి వస్తే… తన తాత వారసత్వాన్ని చూసుకునే క్రమంలో రాజా సాబ్ ఓ రహస్యమైన రాజభవనంలోకి అడుగుపెడతాడు. “ఈ ఇల్లు ఓ మయసభ… ఇక్కడికి రావడమే కానీ వెళ్లాలంటే మీ తాత సంతకం కావాలి” అనే డైలాగ్‌తోనే ఆ భవనం ఎంత ప్రమాదకరమో చెప్పకనే చెప్పారు. నానమ్మ కోరిక నెరవేర్చాలనే తపనతో రాజా సాబ్ తన స్నేహితులతో కలిసి భవనంలోకి వెళ్లినా, అక్కడ దాగి ఉన్న భయానక శక్తిని అంచనా వేయలేకపోతాడు.
ఆ భవనంలోకి అడుగుపెట్టిన ప్రతీ వ్యక్తి రాజా సాబ్ తాత మాయలో చిక్కుకుని అదృశ్యమవుతాడు. భయంకరమైన ప్రేతశక్తితో చెలరేగుతున్న తాతయ్య వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటనేది సస్పెన్స్‌గా మిగిలింది. ట్రైలర్లో ప్లాష్‌బ్యాక్‌లో దేవనగర సంస్థానం, మహారాణి గంగాదేవి అలియాస్ గంగమ్మ పాత్రను పవర్‌ఫుల్‌గా చూపించడం కథపై ఆసక్తిని మరింత పెంచింది. అసలు ఆ మయసభలాంటి భవనానికి రాజా సాబ్‌కు సంబంధం ఏమిటి? దేవనగర సంస్థానం నుంచి గంగమ్మ ఎలా దూరమైంది? రాజా సాబ్ తాత గతం ఏంటి? రాజా సాబ్‌కు వ్యతిరేకంగా అతని తాత ఎందుకు ఎదురు తిరుగుతాడు? వంటి ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే జనవరి 9 వరకు ఆగాల్సిందే. తాజా ట్రైలర్లో హారర్ ఎలిమెంట్స్‌తో పాటు ప్రభాస్ ఫన్ టైమింగ్‌ను కూడా కాస్త చూపించారు. దాదాపు మూడేళ్లుగా ఎదురుచూస్తున్న డార్లింగ్ ఫ్యాన్స్‌కు ఈ సంక్రాంతికి ఫుల్ ట్రీట్ ఖాయం అనే సంకేతాన్ని ‘ది రాజా సాబ్’ ట్రైలర్ స్పష్టంగా ఇచ్చింది.