Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘ది రాజాసాబ్’ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్ భారీ స్థాయిలో నిర్మించారు. మారుతి కెరీర్లోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటివరకు చిన్న, మీడియం రేంజ్ హీరోలతోనే సినిమాలు చేసిన మారుతి, ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్‌ను ఎలా ప్రెజెంట్ చేస్తారన్న ఆసక్తి అభిమానుల్లో ఉంది.ప్రస్తుతం ‘ది రాజాసాబ్’ ప్రమోషన్లలో బిజీగా ఉన్న మారుతి, ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తనపై జరుగుతున్న నెగటివ్ ప్రచారంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
సినిమా ఫెయిల్ అవ్వాలని కొందరు కోరుకుంటున్నారని ప్రశ్నించగా ఆయన స్పష్టంగా స్పందించారు. ఇండస్ట్రీలో కొందరు తన ఫెయిల్యూర్‌ను ఆశిస్తున్నారని, దానికి ప్రధాన కారణం ఈర్ష్య, అసూయలేనని అన్నారు. తాను ఎదిగితే బిజీ అయిపోతానని, అప్పుడైతే అందరికీ అందుబాటులో ఉండనేమో అన్న భయంతోనే కొందరు ఇలా కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ఇతరుల సక్సెస్‌ను చూడలేకపోవడం మానవ సహజమని, పక్కింటి వాళ్లు కారు కొంటే దానికి యాక్సిడెంట్ అవ్వాలని కోరుకునే మెంటాలిటీ కూడా అలాంటిదేనని మారుతి వ్యాఖ్యానించారు. ఇప్పుడైతే తాను చిన్న సినిమాల ఈవెంట్లకూ వెళ్లగలుగుతున్నానని, ఒకవేళ పెద్ద సక్సెస్ వస్తే పిలిచినా రానేమో అన్న భయమే కొందరిలో ఉందన్నారు. ఈసారి తాను పడిపోతే మళ్లీ లేవడేమో అని కొందరు లోపల కోరుకుంటున్నారేమో కానీ, తన ఫెయిల్యూర్ వాళ్లకు ఎలాంటి లాభం చేయదని స్పష్టం చేశారు.
తన విజయంతో తనలో ఇగో వచ్చి, మనుషులను దూరంగా పెడతాడేమో అన్న అనుమానంతోనే కొందరు నెగటివ్‌గా ఆలోచిస్తున్నారని చెప్పిన మారుతి, ఈసారి తాను కిందపడనని, తనపై నెగటివ్ కోరుకునే వాళ్లనే తాను పడేస్తానని ధీమాగా చెప్పారు. మారుతి వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారగా, అభిమానులు ఆయనకు మద్దతుగా కామెంట్లు పెడుతున్నారు. సంక్రాంతి విడుదలకు సిద్ధమవుతున్న ‘ది రాజాసాబ్’తో మారుతి, ప్రభాస్ కలిసి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్ అందుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.