Raja Saab | బాలకృష్ణ ‘అఖండ 2’ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూడగా, ఆ సినిమా అనూహ్యంగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. నిర్మాతల పాత బాకీలు, ఫైనాన్షియర్లకు సెటిల్మెంట్లు పూర్తి కాకపోవడం వంటి ఆర్థిక సమస్యల వల్లే ప్రాజెక్ట్ ఒక్కసారిగా ఆగిపోయింది. భారీ హైప్‌తో ఎదురు చూసిన ఈ ప్రాజెక్ట్ నిలిచిపోవడంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ పరిస్థితుల్లో, ప్రభాస్ నటిస్తున్న ‘రాజాసాబ్’ సినిమా కూడా ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటుందేమో అన్న ఆందోళన సోషల్ మీడియాలో వ్యక్తమవుతోంది. ఎందుకంటే ఈ సినిమా గత ఏడాది నుంచి వాయిదాలు పడుతూ వస్తోంది. కొద్ది రోజుల క్రితం ఢిల్లీకి చెందిన IVY ఎంటర్టైన్మెంట్ సంస్థ, ‘రాజాసాబ్’లో తాము పెట్టిన 218 కోట్ల పెట్టుబడికు సంబంధించిన ఒప్పందాలు ఉల్లంఘించబడ్డాయంటూ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
నిర్మాణ సంస్థ ప్రాజెక్టును నిర్దిష్ట టైమ్‌లైన్‌లో పూర్తి చేయలేదని వారు ఆరోపించారు. ఆ వివాదం అప్పటికి సద్దుమణిగినా, ఇప్పుడు అఖండ 2 సమస్యలతో మళ్లీ ‘రాజాసాబ్’ రిలీజ్‌పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ తాజాగా ఓ ఈవెంట్లో కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ .. “రాజాసాబ్ కోసం బయట నుంచి తీసుకున్న పెట్టుబడులన్నీ క్లియర్ చేశాం. అవి వేరే నిధుల ద్వారా పూర్తి చేశాం. కొద్దిపాటి వడ్డీలు మాత్రమే మిగిలాయి. సినిమా బిజినెస్ జరిగే సమయానికి అవి కూడా క్లియర్ అవుతాయి. ‘రాజాసాబ్’ సంక్రాంతికి ఎటువంటి సందేహం లేకుండా రిలీజ్ అవుతుంది,” అని అన్నారు.
‘రాజాసాబ్’ రిలీజ్‌కు చివరి నిమిషం అడ్డంకులు వస్తాయా? అన్న ప్రశ్నకి కూడా నిర్మాత విశ్వప్రసాద్ స్పందించారు. సినిమాల రిలీజ్‌కు చివరి నిమిషంలో అడ్డంకులు సృష్టించడం వల్ల బయ్యర్లు, ఎగ్జిబిటర్లు, నిర్మాతలు, టెక్నీషియన్స్ మొత్తం వేలాది కుటుంబాలు నష్టంలో పడుతాయి. భవిష్యత్తులో థర్డ్ పార్టీ వ్యక్తులు ఇలాంటి అంతరాయాలు కలిగించకుండా కఠినమైన చట్టపరమైన మార్గదర్శకాలు అవసరం అని స్పష్టం చేశారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ‘రాజాసాబ్’ను దర్శకుడు మారుతి తెరకెక్కిస్తుండగా, ప్రభాస్ కొత్త అవతారంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నిర్మాత వ్యాఖ్యలతో ఇప్పుడు ఫ్యాన్స్ కొంతవరకు ఊరటచెందారు.