By Maduri Mattaiah
Raj tarun interview | హ్యాట్రిక్ విజయాలతో ఇండస్ట్రీకి వచ్చిన యువ కథానాయకుడు రాజ్‌తరుణ్.. ఆ తర్వాత ఆ హవా కొనసాగించడంలో విఫలమయ్యాడు. కెరీర్ మొదట్లో వచ్చిన ఉయ్యాల జంపాల, కుమారి 21 ఎఫ్ మాత్రమే హిట్ టాక్ తెచ్చుకున్నాయి. ఆ తర్వాత డజన్‌కు పైగా సినిమాల్లో నటించినప్పటికీ సరైన సక్సెస్‌ను అందుకోలేకపోయాడు. దీంతో ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో అనుభవించు రాజా సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు రాజ్ తరుణ్. తనను ఇండస్ట్రీకి పరిచయం చేసిన అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై ఈ సినిమా తెరకెక్కడం విశేషం. శ్రీను గవిరెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా నవంబర్ 26న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా రాజ్ తరుణ్‌తో నమస్తే తెలంగాణ జరిపిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ మీకోసం..
ఈ సినిమా విషయంలో మీ అనుభవాలు చెప్పండి?
(నవ్వుతూ) ఇప్పటికే ఉన్న వివాదాలు చాలు.. కొంత వివాదాల్లోకి లాగకండి… ఇక ఈ సినిమా విషయానికొస్తే ఈ సినిమా షూటింగ్‌ను చాలా ఎంజాయ్ చేశాను. నా సినిమాలు దాదాపు భీమవరంలోనే చేశాను. అక్కడంతా తెలిసిన వాళ్లే ఉన్నారు. ఈ పాత్ర చాలా కొత్తది. ఇంతకు ముందు చేసిన వాటితో పోల్చుకుంటే ఇంకాస్త హైపర్‌గా ఉంటుంది.
ఈ టైటిల్‌కు మీ రియల్‌లైఫ్‌లో మీ వ్యక్తిగత జీవితానికి పోలికలు ఏమైనా ఉన్నాయా?
సినిమాలోని పాత్రకు నా నిజ జీవితానికి ఏ మాత్రం సంబంధం ఉండదు. అనుభవించు రాజాలో ప్రకృతి, వికృతి రెండూ ఉంటాయి.
ఈ చిత్రంలో సెక్యూరిటీ గార్డుగా నటించారు? ఆ అనుభవం ఎలా ఉంది?
సెక్యూరిటీ గార్డ్ అవ్వాలంటే వెనకాల ఎంత ప్రాసెస్ ఉంటుంది అనేది ఈ సినిమా టైంలోనే తెలుసుకున్నా. సెక్యూరిటీ గార్డ్ అంటే అంత ఈజీ కాదని అప్పుడే తెలిసింది. మనం ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు చూసే ఫస్ట్ మొహం, రాత్రి ఇంటికి వచ్చేటప్పుడు చూసే చివరి మొహం సెక్యూరిటీ గార్డ్‌దే. వాళ్లు ఒక్క చిరు నవ్వుతో తలుపు తీస్తే మనకు బాగుంటుంది. అదే చిరగ్గా తీశారంటే రోజంతా కూడా మన మూడ్ అలానే అవుతుంది.
గతంలో మీకు ఫ్లాప్ ఇచ్చిన దర్శకుడుతోనే మళ్లీ చేశారు?
సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు సినిమాకు ఈ సినిమాకు దర్శకుడు చాలా మార్పు చెందారు. అప్పుడు కుర్రాడు. ఇప్పుడు ఎంతో కంపోజర్ వచ్చింది. ఎంతో మెచ్యూరిటీ వచ్చింది. పాజిటివిటీ, హానెస్టి ఇలా చాలా వచ్చాయి. పని విషయంలో ఎప్పుడూ క్లారిటీగానే ఉంటాడు. గత తొమ్మిదేళ్ల నుంచి నాకు శ్రీను ఫ్రెండ్. ఒక్క సినిమా ఆడటానికి, ఆడకపోవడానికి చాలా కారణాలుంటాయి. ఏ ఒక్కరినో నిందించలేం. నాకు శ్రీను బలం, సామర్థ్యం ఏంటో తెలుసు. అస్సలు భయపడలేదు. అన్నపూర్ణ స్టూడియో కాబట్టి.. శ్రీను టాలెంట్ చూపించేందుకు అవకాశం దొరికింది.
ఓటీటీ ట్రెండ్ నడస్తున్న ఈ సమయంలో మీ చిత్రం థియేటర్స్‌లో విడుదల కాబోతుండటం ఎలా ఉంది?
మార్చి 29న షూటింగ్ చేద్దామని అనుకున్నాం. కానీ మార్చి 23న లాక్డౌన్ వచ్చింది. దీంతో కథ, స్క్రిప్ట్‌లో మార్పులు చేర్పులు చేసుకుంటూ ఉన్నాం. చివరకు షూటింగ్ పూర్తి చేశాం. కానీ కరోనా వల్ల రిలీజ్ వాయిదా పడుతూ వచ్చింది. ఇలాంటి సినిమాను థియేటర్లోనే చూడాలి. అందుకే ఈ చిత్రాన్ని మంచి టైం చూసి విడుదల చేస్తున్నాం. పైగా సంక్రాంతికి చాలా పెద్ద సినిమాలున్నాయి.
నాగచైతన్య సినిమా చూశారని తెలిసింది? ఆయన రియాక్షన్ ఏమిటి?
నాగ చైతన్య గారు ఈ సినిమా చూశారు. ఆయన చూసినప్పుడు నేను అక్కడ లేను. వేరే షూటింగ్లో ఉన్నాను. సినిమా చూశాక డైరెక్టర్‌తో నలభై నిమిషాలు మాట్లాడారట. సినిమా చాలా నచ్చిందని అన్నారట.
మీ పాత్ర ద్వారా నేటి యువతకు ఇచ్చే సందేశాలు ఏమైనా ఉన్నాయా?
సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయి. ఫాదర్ అండ్ సన్, ఊరికి సంబంధించిన ఎమోషన్ స్ట్రాంగ్‌గా ఉంటాయి. క్లాస్ పీకినట్టుగా మెసేజ్ ఉండదు. కానీ అండర్ లైన్‌గా ఓ మెసేజ్ ఉంటుంది. అమ్మిరాజు పాత్రలో అజయ్ గారు అద్భుతంగా నటించారు.
ఈ సినిమాలో చేతిలో కోడి పట్టుకుని ఉన్నారు? సంక్రాంతి పందేల కోసమా? మీకు కోడిపందేలు ఆడతారా?
గ్యాంబ్లింగ్ అంటే నాకు నచ్చదు. ఆ ఆటలు నేను ఆడను. కోడి పందేలు చూస్తాను కానీ బెట్టింగ్ పెట్టను. ఈ సినిమా సంక్రాంతి పండుగ నుంచి మొదలవుతుంది. అక్కడి పండుగ వాతావరణాన్ని చూపిస్తాం. కోడి పందేల్లో ఎన్నో రకాల కోళ్లు ఉంటాయి. నాకు జంతువులంటే చాలా ఇష్టం. ఈ సినిమాలో వాడిన కోడి నాకు అలవాటు అయింది. షూటింగ్ లేదని ఆ కోడి దిగాలుగా ఉంటుందట. దానికి కూడా షూటింగ్ అలవాటు అయింది. తినడం లేదంట. (నవ్వులు)
ఎటువంటి నేపథ్యం లేకుండా సినీ ఇండస్ట్రీలోకి వచ్చారు.. హీరోగా గుర్తింపు పొందారు ఆ తరువాత మీ సక్సెస్‌ను, కెరీర్‌ను కరెక్ట్‌గా ప్లాన్ చేసుకోలేకపోయారనే రియలైజేషన్ ఏమైనా ఉందా?
నేను చేసిన ప్రతీ సినిమా పట్ల నాకు గర్వంగానే ఉంటుంది. ఓ సినిమా కోసం అందరం కష్టపడతాం. ఎక్కడో ఒక చోట తప్పు జరుగుతుంది. మళ్లీ ఆ తప్పు జరగకుండా చూసుకుంటాం. ఇది నిరంతర ప్రక్రియ. కెరీర్‌ను ప్లాన్ చేయను. ఏది బాగా నచ్చితే అది చేస్తాను. ఇప్పుడు స్టాండప్ రాహుల్ పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. త్వరలోనే విడుదల కానుంది. మాస్ మహారాజా ఈ మధ్యే షూటింగ్ ప్రారంభమైంది.హైదరాబాద్ ఎలా రావాలో కూడా తెలీదు. అలాంటిది ఇక్కడకు వచ్చాను. పద్నాలుగు సినిమాలు చేశాను. ఇంకో సినిమా రిలీజ్‌కు రెడీగా ఉంది. మూడు సినిమాలు లైన్లో ఉన్నాయి. ఇంత కంటే గొప్ప అదృష్టం ఇంకేం కావాలి.
మీ తదుపరి చిత్రాలు ఏమిటి?
స్టాండప్ రాహుల్ ఫీల్ గుడ్ ఎంటర్టైనర్. మాస్ మహారాజా పూర్తిగా డిఫరెంట్‌గా ఉంటుంది. స్లాంగ్ కూడా కొత్తగా ఉంటుంది. ఓ వెబ్ సిరీస్ చాన్స్ వచ్చింది. కాన్సెప్ట్ నాకు చాలా నచ్చింది. కానీ రెండు సినిమా షూటింగ్‌లు చేస్తుండటంతో డేట్స్ అడ్జస్ట్ కాలేదు. ఇక్కడ ఓ సినిమా హిట్ కొట్టిన తరువాత వేరే భాషలో ట్రై చేస్తాను.
interview by ; Maduri mattaiah
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Anubhavinchu Raja | రాజ్ తరుణ్.. ఈ సారి అనుభవించకపోతే కష్టం రాజా..
రాజ్ తరుణ్.. సూపర్ సుడిగాడు ఆఫ్ టాలీవుడ్..
ఆది, రాజ్ తరుణ్ లకు ఆఫర్స్ ఎలా వస్తున్నాయ్
నేను మీ సాయి ధరమ్ తేజ్.. రెండు నెలల తర్వాత మెగా మేనల్లుడి వాయిస్..
Jayasudha: జయసుధ మొహం ఇలా అయిపోయిందేంటి?