రాజ్ తరుణ్ కథానాయకుడిగా రూపొందిన చిత్రం ‘పురుషోత్తముడు’. హాసిని సుధీర్ కథానాయిక. రామ్ భీమన దర్శకుడు. డా.రమేశ్ తేజావత్, ప్రకాశ్ తేజావత్, నిర్మాతలు. ఈ నెల 26న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించారు. దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్ ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు.
ఇందులో నటించిన నటులు బ్రహ్మానందం, రాజారవీంద్ర, ప్రవీణ్ సినిమా విజయంపై నమ్మకం వెలిబుచ్చారు. ‘మంచి సినిమా చేయాలనే కసితో ఉన్న సమయంలో వచ్చిన అవకాశం ‘పురుషోత్తముడు’. నిర్మాతలు నాకు చెప్పిన మాట ఒక్కటే.. ‘మన సినిమా రామాయణం అంత రమణీయంగా ఉండాలి. భారతం అంత భారీగా ఉండాలి’ అని. వారు చెప్పినట్టే చేశానని అనుకుంటున్నా. అన్ని వర్గాలవారికీ అన్ని విధాలా నచ్చే సినిమా ఇది’ అని దర్శకుడు చెప్పారు.