Rahul Sipligunj | స్టార్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తనకి కాబోయే భార్య హరిణ్యా రెడ్డికు ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. నవంబర్ 27న జరగనున్న వారి వివాహం కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. సంగీత్ వేడుకలు అట్టహాసంగా జరుగుతున్న ఈ సమయంలో రాహుల్ ఇచ్చిన సర్‌ప్రైజ్‌కి హరిణ్య తెగ ఫిదా అయింది. టీమ్ఇండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహాల్‌ని స్వయంగా సంగీత్ వేడుకకు ఆహ్వానించి, తన కాబోయే భార్యకు రాహుల్ స్పెషల్ ట్రీట్ ఇచ్చాడు. చాహాల్‌ను చూసి హరిణ్య ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. హరిణ్య తన సోషల్ మీడియాలో .. ఇంత పెద్ద గిఫ్ట్ నా జీవితంలో మర్చిపోలేను. థ్యాంక్ యూ రాహుల్! అంటూ చాహాల్‌తో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇవి నెట్టింట వైరల్ అవుతున్నాయి.
హరిణ్యా రెడ్డి చాహాల్‌కు వీరాభిమాని. ఆమె తన పోస్ట్‌లో మా సంగీత్‌కు వచ్చి మా వేడుకను ప్రత్యేకం చేసినందుకు చాహాల్ గారికి ధన్యవాదాలు అని రాసింది.ప్రస్తుతం రాహుల్ సిప్లిగంజ్, హరిణ్య రెడ్డి, క్రికెటర్ చాహల్ కలిసి దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండగా, వీటిని చూసిన అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఇక రాహుల్–హరిణ్య వివాహానికి సినీ, రాజకీయ ప్రముఖులు భారీగా తరలిరానున్నట్టు తెలుస్తుంది. ఈ హై–ప్రొఫైల్ వెడ్డింగ్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హాజరవుతారని తెలుస్తుంది. ఇటీవల రాహుల్, హరిణ్యా కలిసి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన విషయం తెలిసిందే.
హరిణ్యా రెడ్డి నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి సోదరుడి కుమార్తె. నిశ్చితార్థం సమయంలో కూడా రాహుల్ ఆమెకు ఖరీదైన హ్యాండ్‌బ్యాగ్ గిఫ్ట్ చేసి అందరినీ ఆకట్టుకున్నాడు. నవంబర్ 27 ఉదయం 5 గంటల సమయంలో వీరి వివాహం జరగనుందని తెలుస్తుంది. హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని లగ్జరీ ప్యాలెస్ వేదికగా వివాహం జరగనుందని అంటున్నారు. ఇక ఈ వివాహ వేడుక రాజసంగా, అంగరంగ వైభవంగా జరగనుంది. కాగా, ‘నాటు నాటు’ పాట ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రాహుల్ సిప్లిగంజ్ను సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల అభినందించిన విషయం తెలిసిందే.బోనాలు, వినాయక చవితి స్పెషల్ పాటలతో రాహుల్‌కు అపారమైన క్రేజ్ ఉంది. ఓల్డ్ సిటీ నుంచి మొదలైన అతని ప్రయాణం ఆస్కార్ స్థాయిని తాకింది.