‘ఈ సినిమా ట్రైలర్ అదిరిపోయింది. కార్తీక్ సుబ్బరాజ్ కల్ట్ డైరెక్టర్. తన టేకింగ్ ఎలా ఉంటుందో ఈ ట్రైలర్లో చూపించారు. సినిమా తప్పకుండా బ్లాక్‌బస్టర్ హిట్ అవుతుంది’ అన్నారు అగ్ర హీరో వెంకటేష్. శనివారం జరిగిన ‘జిగర్ తండా డబుల్ ఎక్స్’ ప్రీరిలీజ్ వేడుకలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
రాఘవ లారెన్స్, ఎస్.జె.సూర్య ప్రధాన పాత్రల్లో కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 10న విడుదల కానుంది. కార్తీకేయన్ నిర్మాత. ఈ సందర్భంగా రాఘవ లారెన్స్ మాట్లాడుతూ ‘ఈ సినిమాలో నేను మేకప్ లేకుండా నటించాను.
ఈ సినిమా నా గత చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉంటుంది. ఈ క్రెడిట్ దర్శకుడిదే. తమిళనాడులో ట్రస్ట్ పెట్టి సేవలు చేస్తున్నా. అదే తరహాలో ఇక్కడ కూడా ట్రస్ట్ పెట్టి సేవలు అందించబోతున్నా’ అన్నారు. తన కెరీర్లో ఎంతో ప్రత్యేకమైన చిత్రమని, ప్రతి ఒక్కరు ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతారని దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు తెలిపారు.
తమ సంస్థలో తెరకెక్కించిన బిగ్గెస్ట్ మూవీ ఇదేనని, భవిష్యత్తులో కార్తీక్ సుబ్బరాజుతో తెలుగు స్ట్రెయిట్ సినిమా చేస్తానని నిర్మాత కార్తికేయన్ పేర్కొన్నారు. ఈ సినిమాలో కొత్త కాన్సెప్ట్‌తో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుందని ఎస్.జె.సూర్య అన్నారు. ఈ కార్యక్రమంలో నవీన్‌చంద్ర, శైలేష్ కొలను తదితరులు పాల్గొన్నారు.