Radhika | సీనియర్ నటి రాధికా శరత్‌కుమార్ మరోసారి ప్రేక్షకులను ఆశ్చర్యపరచేందుకు సిద్ధమవుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి నుంచి టాలీవుడ్ టాప్ హీరోల వరకు నటించి తనదైన గుర్తింపు సంపాదించుకున్న రాధికా, హీరోయిన్గా మాత్రమే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా విభిన్న పాత్రల్లో మెప్పించారు. ఇప్పుడు ఆమె కెరీర్లోనే భిన్నమైన పాత్రతో తమిళ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. రాధికా ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా తమిళ చిత్రం ‘తాయి కిళవి’. ఈ సినిమాకు శివకుమార్ మురుగేశన్ దర్శకత్వం వహించగా, ప్రముఖ నటుడు శివకార్తికేయన్ నిర్మాతగా వ్యవహరించారు. అరుళ్ దాస్, బాల శరవణన్, సింగమ్ పులి వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఈ చిత్రంలో రాధికా పూర్తిగా మారిపోయిన లుక్‌లో కనిపించనున్నారు. గ్రామీణ నేపథ్యంలో సాగే కథలో, ఊరిలో రుణాలు ఇచ్చే వృద్ధురాలు ‘పసుపు తాయి’ గా ఆమె పాత్ర రూపుదిద్దుకుంది. ఇప్పటివరకు రాధికాను ఇలా చూడలేదని చెప్పే స్థాయిలో ఆమె గెటప్, మేనరిజమ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. ‘పసుపు తాయి’ కలెక్షన్ల కోసం వస్తుందన్న భయంతో ఊరంతా పరుగులు తీసే సన్నివేశాలు థ్రిల్‌ను కలిగిస్తున్నాయి. రాధికా లుక్స్‌తోనే టెన్షన్ క్రియేట్ చేయడం సినిమాకు ప్రధాన హైలైట్‌గా మారింది.
‘తాయి కిళవి’ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 20న థియేటర్లలో విడుదల కానుంది. ఈ మూవీ తెలుగులో రీమేక్ అవుతుందా లేదా డబ్బింగ్‌తో విడుదల చేస్తారా అన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే ఒకప్పటి తరం అభిమాన హీరోయిన్ అయిన రాధికా ఈ డిఫరెంట్ పాత్రతో తెలుగులోనూ ప్రేక్షకులను పలకరిస్తే బాగుంటుందన్న అభిప్రాయం సోషల్ మీడియాలో వినిపిస్తోంది. మొత్తానికి, ‘పసుపు తాయి’గా రాధికా శరత్‌కుమార్ చేస్తున్న ఈ ప్రయోగం ఆమె కెరీర్లో మరో గుర్తుండిపోయే పాత్రగా నిలుస్తుందేమో చూడాలి.