‘హరిహరవీరమల్లు’ను దృష్టిలో పెట్టుకొని థియేటర్ల బంద్ జరుగుతున్నదని, అందులో కుట్ర ఉందని.. కుట్రదారులెవరో తెలుసుకోవాలని స్వయంగా పవన్‌కల్యాణ్ ఆఫీస్ నుంచి ప్రకటన రావడం ఏ మాత్రం సమంజసంగా లేదని అన్నారు దర్శకనిర్మాత, పీపుల్స్‌స్టార్ ఆర్.నారాయణమూర్తి. సినీరంగంలో గొప్ప స్థానం ఉండి, డిప్యూటీ సీఎంగా ఎదిగిన పవన్‌కల్యాణ్‌పై ఎవరు కుట్రపన్నుతారని ప్రశ్నించారు. పర్సంటేజీ విధానం అమలును పక్కన పెట్టి, ఇదంతా ‘హరిహరవీరమల్లు’ కు నష్టం చేసేందుకు కుట్ర అంటూ తెరపైకి తీసుకురావడం చాలా దుర్మార్గమన్నారు.
శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఇండస్ట్రీ సమస్యలపై మాట్లాడారు. బంద్ గురించి ఫిల్మ్ ఛాంబర్, ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ఎప్పుడూ చర్చ జరగలేదని, ఒకవేళ బంద్ తలపెడితే మూడు వారాల ముందుగా నిర్మాతలకు తెలియజేయాలనే రూల్ ఉందని ఆర్.నారాయణమూర్తి గుర్తు చేశారు. ‘హరిహరవీరమల్లు’ పేరు ఎత్తకుండా ఓ పెద్దన్న తరహాలో ఇండస్ట్రీని చర్చలకు పిలిస్తే పవన్‌కల్యాణ్‌పై మరింత గౌరవం పెరిగేది. పర్సంటేజీ సిస్టమ్ లేకపోవడం వల్ల సగటు నిర్మాత బాగా నష్టపోతున్నాడు. మాల్స్ వచ్చిన తర్వాత సింగిల్ థియేటర్ ఉనికి లేకుండా పోతున్నది. తెలంగాణలో 500 సింగిల్ థియేటర్లు ఉండగా నేడు అవి 200 లకు చేరాయి. మాల్స్‌లో సగటు ప్రేక్షకులు సినిమా చూసే పరిస్థితులు లేవు’ అని ఆర్. నారాయణ మూర్తి తెలిపారు.
25 ఏళ్లుగా థియేటర్లలో పర్సంటేజీ విధానం అమలు కోసం పోరాడుతున్నా ఎలాంటి ఫలితం లభించలేదని ఆర్.నారాయణమూర్తి ఆవేదన చెందారు. ‘మల్టీప్లెక్స్‌ల మాదిరిగానే సింగిల్ థియేటర్లకు కూడా పర్సంటేజీ విధానం ఉండాలి. దీనికోసం గత 25 ఏళ్లుగా పోరాటం చేస్తున్నాం. ఛాంబర్ ముందు ఆందోళనలు కూడా చేశాం. ఎందరో ఛాంబర్ ప్రెసిడెంట్లకు విజ్ఞప్తి చేసినా సమస్య పరిష్కారం కాలేదు. ఈ దేశంలో సగటు ప్రేక్షకుడికి వినోదం సినిమానే. ఈ పాలసీల వల్ల సగటు మనిషి సినిమాకు దూరమవుతున్నాడు. సినిమా హాల్ అంటే ఓ దేవాలయం. అది బాగుండాలి. ఇవాళ ఎన్నో థియేటర్లు కల్యాణమండపాలుగా మారిపోతున్నాయి. కార్పొరేట్ సంస్థలు థియేటర్ల వ్యవస్థను ఆక్టోపస్‌లా ఆక్రమిస్తున్నాయి. కాబట్టి సింగిల్ థియేటర్ వ్యవస్థను బ్రతికించుకోవాలి. వెంటనే పర్సంటేజీ విధానం అమలు చేయాలి.
లేకపోతే ఓటీటీలో సినిమాలు చూస్తారు.’ అని ఆర్.నారాయణమూర్తి అన్నారు. భారీ బడ్జెట్ చిత్రాలు తీయడం పరిశ్రమకు గర్వకారణమేనని, అయితే ఆ సినిమాలకు రేట్లు పెంచడం ఎందుకని నారాయణమూర్తి ప్రశ్నించారు. ‘హాలీవుడ్లో ఎన్నో వందల కోట్లతో సినిమాలు తీస్తున్నారు. షోలే, మోఘల్ ఏ అజాం, లవకుశ వంటి సినిమాలు ఎన్నో వ్యయప్రయాసలతో నిర్మాణం జరుపుకొని అపూర్వ విజయాలను సొంతం చేసుకున్నాయి. ‘లవకుశ’ను ఐదేళ్లు తీశారు. ఆ సినిమాకు టికెట్ ధరలు పెంచమని అడగలేదు. సినిమా బాగుంటే జనాలు వస్తారు. టికెట్ పెంచడం వల్ల అభిమానులే వారి హీరోల సినిమాలను చూడలేకపోతున్నారు’ అని ఆర్.నారాయణ మూర్తి పేర్కొన్నారు.