కరోనా సెకండ్ వేవ్ తర్వాత పెద్ద సినిమాలు విడుదలైన దాఖలాలు లేవు. ఈ క్రమంలో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న క్రమంలో డిసెంబర్ 2న అఖండ విడుదలై పెద్ద విజయం సాధించింది. ఇక ఇప్పుడు అందరి దృష్టి అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్లో రూపొందిన పుష్పపై పడింది. ఈ సినిమా డిసెంబర్ 17 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ విడుదలకానుంది.
పుష్ప చిత్రం మరి కొద్ది రోజులలో విడుదల కానున్న నేపథ్యంలో మూవీ తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చారు సెన్సార్ సభ్యులు. ఈ మూవీ మాంచి మాస్ ఎంటర్టైనర్గా ప్రేక్షకులకి వినోదం పంచనుందని అర్ధమవుతుంది. ఇక ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను డిసెంబర్ 12 వ తేదీన హైదరాబాద్‌లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో జరపనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. అంతేకాదు దీనికి సంబంధించిన ఓ పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది.
పుష్ప చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఆయన నుంచి వచ్చిన అన్ని పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక కథాకథనాల పరంగా ఈ సినిమా నిరూపించుకోవలసి ఉంది. డాన్సులు .. ఫైట్లు హైలైట్ గా నిలవనున్నాయని అంటున్నారు. రష్మిక కథానాయికగా నటించిన ఈ సినిమాలో, జగపతిబాబు, ఫాహద్ ఫాజిల్ , సునీల్ ,అనసూయ, అజయ్ ముఖ్యమైన పాత్రలను పోషించారు.