‘పుష్ప-2’ తొలి రోజు నుంచే భారతీయ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తున్నది. తాజాగా ఈ సినిమా నాలుగు రోజుల్లో 829 కోట్ల కలెక్షన్స్ సాధించి ఈ ఫీట్‌ను సొంతం చేసుకున్న తొలి భారతీయ సినిమాగా నిలిచింది. దక్షిణాదితో పాటు బాలీవుడ్లో సైతం పుష్పరాజ్ జైత్రయాత్ర కొనసాగిస్తున్నాడు. నాలుగో రోజు బాలీవుడ్లోనే 86కోట్లు వసూళ్లను రాబట్టింది. రాబోవు రోజుల్లో ఈ సినిమా మరిన్ని రికార్డులను బద్దలు కొడుతుందనే నమ్మకం ఉందని మేకర్స్ తెలిపారు. అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ‘పుష్ప-2’ విడుదల రోజు నుంచే సంచలన వసూళ్లతో దూసుకుపోతున్నది.
అల్లు అర్జున్‌పై బాలీవుడ్ అగ్ర నటుడు, బిగ్‌బి అమితాబ్ బచ్చన్ ప్రశంసలు కురిపించారు. తాను అతని పనితీరుకు అభిమానినని తెలిపారు. ‘పుష్ప-2’ ప్రమోషనల్ కార్యక్రమాల్లో భాగంగా ముంబయి మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అమితాబ్ బచ్చన్ నటన ప్రతి ఒక్కరికి స్ఫూర్తి అని, ఆయన సినిమాలు చూస్తూ తాను పెరిగానని, అమితాబ్‌ను స్ఫూర్తిగా తీసుకొని కెరీర్లో ముందుకెళ్తున్నానని బన్నీ చెప్పారు. తాజాగా ఈ వీడియోను అమితాబ్ బచ్చన్ తన సోషల్‌మీడియా ఖాతాల్లో షేర్ చేశారు. బన్నీ భవిష్యత్తులో ఎన్నో విజయాలు అందుకోవాలని, ఎంతో మందికి స్ఫూర్తినివ్వాలని అమితాబ్ బచ్చన్ తన పోస్ట్‌లో ఆకాంక్షించారు.