Puri Jagannadh | సినిమాల్లోనే కాదు.. జీవితంపై తనదైన తాత్విక ఆలోచనలతో కూడా తరచూ వార్తల్లో నిలిచే దర్శకుడు పూరీ జగన్నాథ్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన ‘పూరీ మ్యూజింగ్స్’ పాడ్‌కాస్ట్‌లో ఈసారి ఆయన ‘డిప్రెషన్’ అనే అంశంపై మాట్లాడారు. సాధారణంగా అందరూ నెగెటివ్‌గా భావించే డిప్రెషన్లో కూడా కొన్ని పాజిటివ్ కోణాలు ఉంటాయని ఆయన వివరించారు. వేగంగా సాగుతున్న నేటి జీవితంలో మనం ఆగకుండా పరిగెడుతూనే ఉంటామని, అలాంటి సమయంలో డిప్రెషన్ మన జీవితానికి ఒక ‘పాజ్’ లాంటిదిగా పనిచేస్తుందని పూరీ చెప్పారు. డిప్రెషన్ కారణంగా మనుషులు ఒంటరిగా ఉండాలని అనుకుంటారని, అదే సమయంలో తమ గురించి తాము నిజాయితీగా ఆలోచించడం మొదలుపెడతారని తెలిపారు.
డిప్రెషన్ వల్ల మనం స్లో డౌన్ అవుతాం. ఫ్రెండ్స్‌ను కలవడం తగ్గుతుంది. ఒంటరిగా కూర్చొని మన అలవాట్లు, సంబంధాలు, జీవితంలో వెళ్తున్న దారి గురించి ఆలోచిస్తాం. అప్పుడు మన తప్పులు కూడా స్పష్టంగా కనిపిస్తాయి అని పూరీ అన్నారు. తాము గతంలో కొందరితో తప్పుగా ప్రవర్తించామేమో అన్న భావన కూడా అలాంటి సమయంలో కలుగుతుందని, దాంతో మనుషుల్లో ఎంపతీ పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇతరుల బాధను కూడా అర్థం చేసుకునే స్థితికి మనిషి చేరుకుంటాడని చెప్పారు. ముఖ్యంగా కళాకారులకు డిప్రెషన్ ఒక భావోద్వేగ అనుభవంగా మారుతుందని పూరీ పేర్కొన్నారు. “ఒక ఆర్టిస్ట్, రైటర్ లేదా మ్యూజిషియన్ డిప్రెషన్ తర్వాత చేసే పని మరింత అర్థవంతంగా ఉంటుంది” అని ఆయన వ్యాఖ్యానించారు.
అయితే డిప్రెషన్‌ను గొప్పగా భావించొద్దని కూడా పూరీ స్పష్టం చేశారు. తీవ్రమైన మానసిక కుంగుబాటు ఆరోగ్యానికి ప్రమాదకరమని, అది నిద్ర, పని, రోజువారీ జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరించారు.డిప్రెషన్ వల్ల వచ్చే బాధ తక్కువ స్థాయిలో ఉంటే అది ఒక సంకేతంలా ఉపయోగపడుతుంది. కానీ అది తీవ్రంగా మారితే హానికరం. ఆ బ్యాలెన్స్‌ను మనమే కాపాడుకోవాలి అని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా డిప్రెషన్‌ను ఎదుర్కొని జీవితంలో గొప్ప విజయాలు సాధించిన ప్రముఖులను కూడా పూరీ ఉదాహరణగా చెప్పారు. పేదరికం, నిరాశ మధ్య పెరిగిన ప్రముఖ కమెడియన్ జిమ్ క్యారీ తన బాధను నవ్వులుగా మార్చుకున్నాడని తెలిపారు. అలాగే వ్యక్తిగత సమస్యలతో మానసిక కుంగుబాటుకు గురైన ప్రముఖ గాయని లేడి గగ తన బాధను సంగీతంగా మలచుకుని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని చెప్పారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకర్ కూడా జీవితంలో ఎన్నో ఓటములు, మానసిక ఒత్తిడిని ఎదుర్కొన్నప్పటికీ చివరకు ప్రపంచంలో అత్యంత గౌరవనీయ నాయకుల్లో ఒకరిగా నిలిచారని పూరీ గుర్తు చేశారు. చివరగా ప్రముఖ రచయిత విక్టర్ హ్యూగో చెప్పిన మాటను పూరీ ప్రస్తావించారు. “అత్యంత చీకటి రాత్రి కూడా ముగుస్తుంది.. మళ్లీ సూర్యుడు ఉదయిస్తాడు” అంటూ డిప్రెషన్ శాశ్వతం కాదని, ప్రతి కష్టానికి ఒక ముగింపు ఉంటుందని ఆయన పేర్కొన్నారు.