Puri Jagannadh | టాలీవుడ్ అగ్ర దర్శకుడు పూరీ జగన్నాథ్ సినిమాలను తెరకెక్కించడమే కాకుండా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఫిలాసఫీ పేరిటా పాడ్ కాస్ట్‌లు చేస్తాడన్న విషయం తెలిసిందే. పూరి మ్యూజింగ్స్() అనే పేరుతో పూరీ తన భావలతో వివిధ అంశాలపై మాట్లాడుతుంటాడు. ఈ విషయాలను యూట్యూబ్ వేదికగా అప్లోడ్ చేస్తూ ఉంటాడు. దీనికి ప్రేక్షకుల నుంచి కూడా మంచి ఆదరణ ఉంది. అయితే తాజాగా పూరీ ‘కన్జ్యూమింగ్’ అనే అంశంపై మాట్లాడారు. మన ఆలోచనలు మనపై ఎలా ప్రభావం చూపుతాయని అనే అంశంపై పూరీ ఇందులో మాట్లాడారు.
చైనాలో ఒక గ్రేట్ ఫిలాసఫర్ ఉన్నాడు. లావోజ్ అతడి పేరు. 571 బీసీలో పుట్టాడు. ఆయన ఒక మంచి మాట చెప్పాడు. వాచ్ యూవర్ థాట్స్. నీ మెదడులో వస్తున్న ఆలోచనలను గమనించు. ఎందుకంటే నీ ఆలోచనలు నీ మాటలవుతాయి, నీ మాటలే నీ పనులు అవుతాయి. నీ పనులే నీ అలవాట్లు అవుతాయి. ఆ తర్వాత అదే నీ గుణం అవుతుంది. ఆ గుణమే నీ విధిని నిర్ణయిస్తుంది. అయితే మనకు ఈ ఆలోచనలు ఎలా వస్తాయి. చదవడం వలన చూడడం వలన, వినటం వలన, ఫ్రెండ్స్‌తో తిరగడం వలన వస్తాయి. మనం రోజు దేనిని ఎక్కువగా వాడతామో అవే ఆలోచనలు వస్తుంటాయి. మనం చూసే వీడియోలు, పుస్తకాలు మన ఆలోచనా విధానాన్ని మార్చేస్తాయి. పనికి రాని వెధవలతో తిరిగి, పనికిరాని వీడియోలు చూస్తూ రోజూ వాళ్ల గురించి, వీళ్ల గురించి పనికి రాని విమర్శలు చేస్తూ ఉంటే అతి తక్కువ కాలంలో మీరు కూడా సక్సెస్‌ఫుల్‌గా ఎందుకూ పనికి రాకుండా పోతారు
రోజూ మనకు తెలియకుండా ఎన్నో న్యూస్‌లు మన సెల్ ఫోన్లో నోటిఫికేషన్స్ వస్తాయి. ఎన్నో యూట్యూబ్ వీడియోలు చూడమని మనకు సలహాలు ఇస్తుంటాయి. రోడ్డు ఎక్కితే బోర్డ్ మీదా ఏవో ఉంటే చదువుతూ వెళతాం. పక్కన ఎవరో మాట్లాడుతుంటే వింటూ ఉంటాం. ఇలా బయట ప్రపంచంలో ఎన్నో విషయాలకు మనం రియాక్ట్ అవుతూ ఉంటాం. ఇవన్ని మన ఆలోచనల మీద ఎఫెక్ట్ చూపిస్తాయి.ఇందులో మనం దేనికైనా ఎమోషనలైతే, అనవసరంగా.. అందులో కొట్టుకుని చాలా దూరం పోతాం. ముక్కూమొహం తెలియని వాడితో వాదనకు దిగుతాం. అన్ని పనులు మానేసి, లాసూట్ ఫైల్ చేసే పనిలో బిజీగా ఉంటాం. రోజూ నాలెడ్జ్ పెంచుకోకపోయిన పర్లేదు. కానీ కనీసం చెత్త విషయాలను మాత్రం మైండ్లోకి ఎక్కించుకోకుండా ఉంటే చాలు. ఎక్కడో చైనాలో ఉన్న లావోజ్ గురించి చదవటం వల్లే కదా ఈ విషయం తెలిసింది. అందుకే మంచి దాన్ని మనకు పనికివచ్చే దానిని మాత్రమే తీసుకోవాలి. అలా చేస్తే మన ఆలోచనలు మారతాయి. మన ఆలోచనలు మాటలు అవుతాయి. మాటలు పనులు అవుతాయి. పనులు ఆలోచనలు అవుతాయి ఆ ఆలోచనలు మన వ్యక్తిత్వన్ని నిర్ణయిస్తాయి, ఆ వ్యక్తిత్వమే మన విధిని నిర్ణయిస్తుంది అంటూ పూరీ జగన్నాధ్ చెప్పుకోచ్చాడు.