లైగర్, డబుల్ ఇస్మార్ట్ చిత్రాల అనుభవాలను పాఠాలుగా చేసుకొని, తన కంఫర్ట్ జోన్ నుంచి పూర్తిగా బయటకు వచ్చి ఓ భిన్నమైన కథ రాసుకున్నారు అగ్ర దర్శకుడు పూరీ జగన్నాథ్. కథతోపాటు పాత్రల ఎంపిక విషయంలో కూడా ఆయన విభిన్నంగా వెళ్తున్నారు. ఇప్పటికే కథానాయకుడిగా తమిళ అగ్ర నటుడు విజయ్ సేతుపతిని తీసుకున్నారు. సీనియర్ నటి టబుని ఓ కీలక పాత్రకు ఎంపిక చేశారు. రీసెంట్గా ఈ ప్రస్టేజియస్ ప్రాజెక్ట్‌లోకి లక్కీ హీరోయిన్ సంయుక్త మీనన్ వచ్చి చేరింది.
ఈ విషయాన్ని తెలియజేస్తూ.. చిత్ర బృందం ఎక్స్(ట్విటర్)లో పోస్ట్ పెట్టింది. ‘అమె నడకలో హుందాతనం.. కళ్లల్లో ఆగ్రహం..’ అంటూ సంయుక్తకు స్వాగతం పలుకుతూ ఆమెతో కలిసి పూరీ, ఛార్మీ దిగిన ఫొటోను ఈ పోస్ట్‌లో పంచుకున్నారు. బాలీవుడ్ నటి రాధిక ఆప్టేని ఈ సినిమాలో ఎంపిక చేసినట్టు గతంలో వార్తలొచ్చాయి. ఇప్పుడు ఆమె స్థానంలోనే సంయుక్త మీనన్‌ని తీసుకున్నట్టు తెలుస్తున్నది. ఈ చిత్రానికి ‘బెగ్గర్’ అనే టైటిల్ ముందు అనుకున్నారు. తాజాగా ‘భిక్షాందేహి’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు.