Puri Jagannadh Happy New Year Podcast | అగ్ర దర్శకుడు పూరీ జగన్నాథ్ మరో కొత్త పాడ్ కాస్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పూరి మ్యూజింగ్స్ (Puri Musings) అనే పేరుతో పూరీ తన భావాలను వివిధ అంశాలపై మాట్లాడుతుంటాడు అన్న విషయం తెలిసిందే. ఈ విషయాలను యూట్యూబ్ వేదికగా అప్లోడ్ చేస్తూ ఉంటాడు. దీనికి ప్రేక్షకుల నుంచి కూడా మంచి ఆదరణ ఉంది. తాజాగా కొత్త ఏడాది సందర్భంగా.. హ్యాపీ న్యూ ఇయర్ (HAPPY NEW YEAR) అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
తన జీవితంలో ఉన్న కష్టాలు తట్టుకోలేక పాపం బాలరాజు కఠోర తపస్సు చేశాడు. బాలరాజు కఠోర తపస్సుకు ప్రత్యక్షమైన దేవుడు చిరాగ్గా ఏంటి అన్నట్టు బాలరాజు మోహం చూశాడు. స్వామి ఖర్చులు ఎక్కువయిపోయాయి. కోట్లు కావాలి. కాస్తా మీ దగ్గర డబ్బు ఏమైనా ఉంటే నా అకౌంట్లో డిపాజిట్ చేయారా అని బాలరాజు దేవుడిని అడుగుతాడు. నా దగ్గర క్యాష్ ఉండదు నాయనా బ్యాంక్ అకౌంట్ కూడా లేదు అని దేవుడు చెబుతాడు. పోనీ బంగారం డైమండ్స్ లాంటివి ఏమీ లేవా స్వామి అని బాలరాజు అడిగాడు. నీకు ఇస్తే అందరూ అడుగుతారమ్మా అందుకే దగ్గర పెట్టుకోలేదు అంటాడు దేవుడు. సరే అని చెప్పి నాకు ఆనందాన్ని ప్రసాదించు అన్నాడు.
దీనికి దేవుడు సమాధానమిస్తూ.. సంతోషం అనేది నీ మానసిక స్థితిని బట్టి ఉంటది బాల.. నువ్వు రోజు లేని దాని గురించి ఏడుస్తుంటే ఇంకా ఆనందం ఎక్కడి నుంచి వస్తది అన్నాడు దేవుడు. అయితే నా జీవితంలో కష్టాలు అనేవి లేకుండా తీసేయ్ అంటాడు బాలరాజు. దేవుడు చేబుతూ.. అవి తీసేస్తే ఎలా.. కష్టాల తర్వాతే కదా సుఖాలు వచ్చేలా మనం రూల్స్ రాసుకున్నాం. మరి సుఖం కావాలంటే కష్టాలు పడాల్సిందే అంటూ దేవుడు చెబుతాడు. దీనికి బాలరాజు.. ఓకే స్వామి నాకు తాగుడు ఎక్కువైపోయింది. మందు మానేసే లాగా చేయగలరా అంటూ అడుగుతాడు. దేవుడు చెబుతూ.. రేయ్ ఆ మందు మొదలు పెట్టింది నువ్వు. నేను కాదు నువ్వే మానేయాలి. అయితే స్వామి ఈ మధ్య అందరి మీద అరుస్తున్నాను కాస్త ఆ సహనం ప్రసాదించగలరా. అది నేను ఇవ్వాల్సిన పని లేదు బాలరాజు కష్టాలు పడి పడి నీకు సరదా తీరిపోతుంది. అప్పుడు ఆటోమేటిక్‌గా నీకు ఎక్కడ లేని సహనం వచ్చేస్తది డోంట్ వర్రీ అన్నాడు.
ఓహో అలా అయితే నాకు జ్ఞానోదయం ప్రసాదించి బుద్ధుడిలా మార్చేయి స్వామి అని బాలరాజు అడుగుతాడు. దీనికి దేవుడు సమాధానమిస్తూ.. బుద్ధుడికి కూడా నేను ఇవ్వలేదు బాబు. కేవలం 49 రోజులు మెడిటేషన్ చేస్తే ఆయనకు జ్ఞానోదయం వచ్చేసింది. నువ్వు కూడా ట్రై చేయి పెద్ద పని ఏం కాదు అని దేవుడు చెబుతాడు. వద్దులే స్వామి అంత ఓపిక లేదు పోనీ ఈ కొత్త సంవత్సరం అయినా నా జీవితం మారుతుందా అని అడుగుతాడు బాలారాజు. నాయన ప్రతి రోజు సెలబ్రేట్ చేసుకోమని నీకు
ఇంత పొడుగు జీవితాన్ని ఇస్తే నువ్వు ఒక్క రోజు సెలబ్రేట్ చేసుకొని జీవితం మారుతుందా అని నన్ను అడిగితే ఎలా అని దేవుడు చెబుతాడు. దీంతో బాలరాజుకి పిచ్చిలేస్తుంది.
మరి ఎవరిని అడగాలి.. ఏం అడిగినా ఇవ్వవు పైగా తిక్కతిక్క సమాధానాలు చెబుతున్నావు. అసలు నిన్ను ఎందుకు మొక్కాలి. అని అనగానే.. దేవుడు నిన్ను ఎవడు మొక్కమన్నాడురా నేను చెప్పానా.. అంటూ దేవుడు అంటాడు. దీంతో దేవుడు అలా అనేసరికి బాలరాజు చాలా కంగారుపడిపోతాడు. కోపం కంట్రోల్ చేసుకుంటూ దేవుడు ఇలా చెప్పాడు.
నాకోసం ఇంత పెద్ద తపస్సు చేసావు. ఆ తపస్సు ఏదో నీ కోసం ఏడవచ్చు కదా అన్నీ నేనే వేస్తే ఇంక నువ్వు ఎందుకురా బేవకూఫ్ చేత కాకపోతే ప్యాకప్ చెప్పి పైకి వచ్చేయ్ అని దేవుడు చెప్పడంతో.. ఆ మాట విని బాలరాజు కంగుతిన్నాడు అప్పుడు దేవుడు చెబుతూ.. మళ్లీ చెబుతున్నా బాల.. నీకు అన్ని ఇచ్చాను.. ఇప్పుడు ఇంకో కొత్త సంవత్సరం కూడా ఇస్తున్నా వాడుకుంటే వాడుకో ఆడుకుంటే ఆడుకో.. తాగుతావో తందనలాడుతావో నీ ఇష్టం ప్రతి దానికి నన్ను పిలవద్దు హ్యాపీ న్యూ ఇయర్ అని బాలరాజు డిప్ప మీద కొట్టి చిటికలో మాయమైపోయాడు దేవుడు. అంటూ పూరి చెప్పుకోచ్చాడు.