Puri Jagannadh | టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తన ప్రత్యేక ఆలోచనలతో ఎప్పుడూ చర్చల్లో నిలుస్తుంటారు. ‘పూరి మ్యూజింగ్స్’ పేరిట తన అభిప్రాయాలను పాడ్కాస్ట్ల రూపంలో పంచుకుంటూ వస్తున్న ఆయన, తాజాగా ‘సైన్స్ అండ్ బిలీఫ్’ అనే అంశంపై మాట్లాడి మరోసారి ఆకట్టుకున్నారు. సినీ ఇండస్ట్రీలో 26 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ఎపిసోడ్‌కు మరింత ప్రాధాన్యం ఏర్పడింది. పూరి మాట్లాడుతూ… “ఈ ప్రపంచాన్ని మనం శాస్త్రబద్ధంగా అర్థం చేసుకోవాలి కానీ, సంప్రదాయాలు లేదా నమ్మకాల ఆధారంగా కాదు” అని స్పష్టం చేశారు. సైన్స్‌కు ఆధారాలు అవసరమని, అది పరిశీలన, పరీక్షల ఆధారంగా మాత్రమే నిజాన్ని నిర్ధారిస్తుందని చెప్పారు.
ఏదైనా వస్తువు చేతిలోంచి జారిపడితే అది కిందపడటానికి కారణం గ్రావిటీ… నమ్మకాలు కాదు అంటూ ఆయన ప్రత్యేకమైన ఉదాహరణతో సైన్స్ ప్రాముఖ్యతను వివరించారు. ప్రపంచంలోని ప్రతి విషయాన్ని ప్రశ్నించాలి, గుడ్డిగా నమ్మకూడదని పూరి సూచించారు. “ప్రూఫ్, డేటా, ఎక్స్పెరిమెంట్స్ లేకుండా దేన్నీ నమ్మకండి” అని స్పష్టం చేశారు. సైన్స్ ఎప్పుడూ తనను తాను సరిదిద్దుకుంటూ ముందుకు సాగుతుందని, కానీ మూఢనమ్మకాలు మాత్రం మారవని అన్నారు. మనిషి జీవితం పూర్తిగా బయోలాజికల్ ప్రాసెస్‌లపై ఆధారపడి ఉందని పూరి చెప్పారు. “మనలోని ఆలోచనలు, భావోద్వేగాలు అన్నీ బ్రెయిన్, న్యూరాన్స్, బయోకెమిస్ట్రీ వల్లే పుడతాయి” అని వివరించారు. ప్రేమ, భయం వంటి భావాలకు కూడా శాస్త్రీయ వివరణ ఉందని చెప్పారు.
మనిషి ఒక్కరోజులో పుట్టలేదు… బిలియన్ల సంవత్సరాల పరిణామ ఫలితమే మనిషి అని పూరి అన్నారు. స్కూల్, కాలేజీల్లో నేర్చుకునే సైన్స్‌ను నమ్మాలని, సమాజంలో వినిపించే ప్రతి విషయాన్ని నమ్మకూడదని సూచించారు. సమాజంలో సైంటిఫిక్ థింకింగ్ పెరగాల్సిన అవసరం ఉందని పూరి జగన్నాథ్ అభిప్రాయపడ్డారు. ఎవరైనా దెయ్యం ఉందని చెబితే… ఎవిడెన్స్ అడగండి. ఆధారాలు లేకపోతే దాన్ని పెండింగ్‌లో పెట్టండి అని సూచించారు. భూమి బల్లపరుపుగా ఉందని ఇప్పటికీ నమ్మే వారు ఉన్నారని, అందుకే లాజికల్ థింకింగ్ చాలా అవసరమని చెప్పారు. సైన్స్ మిమ్మల్ని చంద్రమండలానికి తీసుకెళ్తే… నమ్మకం మిమ్మల్ని స్వర్గానికి తీసుకెళుతుంది అన తనదైన స్టైల్లో పూరి తన మాటలను ముగించారు. ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, సైన్స్‌పై అవగాహన పెంపొందించాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు.