కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ప్రస్థానం ముగిసింది.ఆయన జన్మ పునీతం అయింది. నటనతో, సేవా కార్యక్రమాలతో వేలాది ప్రేక్షకుల మనసులని గెలుచుకున్న పునీత్ రాజ్ కుమార్ అందరిని వెళ్లి వదిలి వెళ్లారు. ఆయన మరణించి రెండు రోజులు అయిన కూడా ఆయన మరణం జీర్ణించుకోలేకపోతున్నారు. పునీత్ మరణంతో యావత్ సినిమా ఇండస్ట్రీ శోకసంద్రంలో మునిగిపోయింది.
కొద్ది సేపటి క్రితం బెంగళూరులోని కంఠీరవ మైదానంలో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో పునీత్ అంతిమ సంస్కారాలు జరాగాయి. తల్లిదండ్రులు రాజ్‌కుమార్, పార్వతమ్మ సమాధుల వద్దే పునీత్ అంత్యక్రియలు చేసారు. అంత్యక్రియల్లో సీఎం బొమ్మై, మాజీ సీఎం యడియూరప్ప, కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్, పలువురు సినీ నటులు పాల్గొన్నారు. తమ అభిమాన నటుడిని చివరిసారిగా చూసుకోవడానికి భారీగా అభిమానులు తరలివచ్చారు. పునీత్ సోదరుడు రాఘవేంద్ర కుమారుడు వినయ్‌తో అంత్యక్రియలు నిర్వహించారు. పునీత్ ఇక లేడని తెలిసి ఆయన అభిమానులు, కుటుంబ సభ్యులు, ప్రముఖులు కన్నీటి పర్యంతం అవుతున్నారు.
శుక్రవారం తెలుగు అగ్ర నటులు చిరంజీవి, బాలకృష్ణ, ఎన్టీఆర్, వెంకటేష్, రానా, శ్రీకాంత్, అలీ తదితరులు పునీత్‌రాజ్‌కుమార్‌కు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ కన్నీటిపర్యంతమయ్యారు. పునీత్‌రాజ్‌కుమార్ పార్థివ దేహాన్ని చూసిన ఎన్టీఆర్ దుఃఖాన్ని ఆపుకోలేకపోయారు. పునీత్ సోదరుడు శివరాజ్‌కుమార్ ఎన్టీఆర్‌ను చూసి భావోద్వేగానికి గురయ్యారు. ఎన్టీఆర్ ఆయన్ని దగ్గరకు తీసుకొని ఓదార్చారు.