Punarnavi Bhupalam | తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితమైన నటి పునర్నవి భూపాలం తాజాగా వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ‘ఉయ్యాల జంపాల’ సినిమాతో తెలుగు తెరపై అడుగుపెట్టిన ఈ భామ, తన అమాయకత్వం, సహజమైన నటనతో మొదటి చిత్రంతోనే మంచి గుర్తింపు సంపాదించింది. పల్లెటూరి అమ్మాయిగా కనిపించిన ఆమె పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుని, ఆమెను ఇండస్ట్రీకి పరిచయం చేసింది. ఆ తర్వాత పలు తెలుగు చిత్రాల్లో నటించినప్పటికీ, ఆశించిన స్థాయిలో అవకాశాలు రాకపోవడంతో కొంతకాలం సినిమాలకు దూరమైంది. ఈ సమయంలోనే బుల్లితెరపై ‘బిగ్ బాస్ తెలుగు’లో పాల్గొని మరోసారి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.
ఈ కార్యక్రమం ద్వారా ఆమెకు మంచి గుర్తింపు లభించడంతో పాటు అభిమాన వర్గం కూడా పెరిగింది. నిజానికి సినిమాల కంటే ఈ కార్యక్రమం ద్వారానే ఆమెకు ఎక్కువ ప్రాచుర్యం లభించింది. అయితే, వచ్చిన అవకాశాలను పక్కనపెట్టి విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు నిర్ణయించుకుంది పునర్నవి. లండన్‌లో చదువులు కొనసాగిస్తూ, పూర్తిగా తన విద్యపై దృష్టి పెట్టింది. అయినప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండి అభిమానులతో తన అనుభవాలను పంచుకుంటూ ఉండేది. ఇటీవల డిసెంబర్ నెలలో తాను ప్రేమించిన వ్యక్తితో నిశ్చితార్థం జరిగినట్లు ప్రకటించి అందరికీ సర్ప్రైజ్ ఇచ్చింది. ఈ వార్తతో ఆమె అభిమానులు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.
ఇక మార్చి 20న ఆమె తన ప్రియుడు హేమంత్ వర్మను వివాహం చేసుకుంది. హేమంత్ వర్మ ప్రముఖ ఫోటోగ్రాఫర్‌గా గుర్తింపు పొందిన వ్యక్తి. వీరిద్దరూ చాలా కాలంగా ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వివాహ వేడుకను చాలా సింపుల్‌గా, కుటుంబ సభ్యులు మరియు సన్నిహితుల మధ్య నిర్వహించారు. ప్రైవేట్‌గా జరిగిన ఈ వేడుకకు కొద్దిమంది మాత్రమే హాజరయ్యారు. ప్రస్తుతం ఈ జంటకు సోషల్ మీడియాలో అభిమానులు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్నపునర్నవి ఇప్పుడు తన వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. ఇక భవిష్యత్తులో ఆమె మళ్లీ సినిమాల్లోకి వస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.