తన కుంచెతో తెలుగు సినిమా పోస్టర్స్‌కు కొత్త సొబగులద్దిన సీనియర్ పబ్లిసిటీ డిజైనర్ ఈశ్వర్(84) మంగళవారం చెన్నైలో కన్నుమూశారు. ఈశ్వర్ అసలు పేరు కొసనా ఈశ్వరరావు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో 1938 ఫిబ్రవరి ఒకటవ తేదీన జన్మించారాయన. తండ్రి ద్వారా ఈశ్వర్‌కు చిత్రలేఖనంపై ఆసక్తి ఏర్పడింది. బాపు దర్శకత్వంలో రూపొందిన ‘సాక్షి’ సినిమాతో పబ్లిసిటీ డిజైనర్‌గా తెలుగు చిత్రసీమకు పరిచయమయ్యారు. ఆ సినిమా ద్వారా ప్రయాణాన్ని మొదలుపెట్టిన ఈశ్వర్ 2500లకుపైగా చిత్రాలకు పబ్లిసిటీ ఆర్టిస్ట్‌గా పనిచేశారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, ఒరియా, అస్సామీ భాషా చిత్రాలకు పోస్టర్స్‌ను డిజైన్ చేశారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎంజీఆర్, శివాజీగణేషన్ మొదలుకొని చిరంజీవి, వెంకటేష్ వరకు నాలుగైదు తరాల హీరోలతో పనిచేశారు. ‘అయినవాళ్లు’ అనే సినిమాకు దర్శకత్వం వహించారు. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో మళ్లీ మెగాఫోన్ పట్టలేదు. 2000 సంవత్సరంలో కోడిరామకృష్ణ దర్శకత్వంలో రూపొందిన ‘దేవుళ్లు’ పబ్లిసిటీ డిజైనర్‌గా ఈశ్వర్ చివరి చిత్రం. మాన్యువల్ పోస్టర్స్‌ను రూపొందించడం తగ్గి కంప్యూటర్ డిజైనింగ్‌కు ప్రాధాన్యత పెరగడంతో కొత్త విధానంపై ఆసక్తి లేకపోవడంతో స్వచ్ఛందంగా సినిమాలకు దూరమయ్యారు. ఈశ్వర్ రాసిన ‘సినిమా పోస్టర్’ పుస్తకానికి ఉత్తమ సినిమా రచనగా నంది పురస్కారం లభించింది. సినీ రంగానికి ఆయన చేసిన సేవలకు గాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రఘుపతి వెంకయ్య పురస్కారంతో ఆయన్ని సత్కరించింది. ఈశ్వర్‌కు భార్య వరలక్ష్మితో పాటు ఇద్దరు కుమారులు, కుమార్తెలు ఉన్నాయి. ఈశ్వర్ మరణం పట్ల తెలుగు సినీ ప్రముఖుల సంతాపం వ్యక్తంచేశారు.