‘ఎన్టీఆర్ ఘాట్ నాకు పుణ్యక్షేత్రం. ఎన్టీఆర్ అభిమానులకు ఇది శక్తినిచ్చే స్థలం. అలాంటి గొప్ప స్థానంలో ఎన్టీఆర్ ముని మనవడి సినిమా ప్రారంభోత్సవం జరగడం నాకెంతో ఆనందంగా ఉంది. ఇది ఒక మిసైల్ లాంచింగ్లా నాకనిపిస్తుంది. ఇది నా జీవితంలోనే మరపురాని ఘట్టం.’ అని దర్శకుడు వైవీఎస్ చౌదరి అన్నారు. స్వర్గీయ మహానటుడు డా.ఎన్టీరామారావు ముని మనవడు, దివంగత హరికృష్ణ మనవడు, దివంగత జానకిరామ్ తనయుడు యంగ్ హీరో నందమూరి తారక రామారావు హీరోగా, వీణారావు హీరోయిన్గా తెరంగేట్రం చేస్తున్న చిత్రం ప్రారంభోత్సవం సోమవారం హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో ఉన్న ఎన్టీఆర్ ఘాట్ వద్ద వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఈసినిమా దర్శకుడు వైవీఎస్ చౌదరి పై విధంగా స్పందించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ‘ఈ సినిమాలోని తన పాత్ర కోసం మా యంగ్ ఎన్టీఆర్ కొన్ని రోజులుగా చాలా కష్టపడుతున్నారు.
ఆయనకు నందమూరి కుటుంబ సభ్యుల సపోర్ట్ ఉంది. నందమూరి వీర అభిమానిగా తెలుగు సాహిత్యం, సంప్రదాయం, హైందవ సంస్కృతి నేపథ్యాలతో ఎంతో కష్టపడి ఒక మంచి కథ తయారు చేశా. కష్టపడి పనిచేస్తాం. మా కష్టాన్ని చూడండి. ఆశీర్వదించండి.’ అని తెలిపారు వైవీఎస్ చౌదరి. హీరోహీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి నారా భువనేశ్వరి క్లాప్ ఇవ్వగా, దగ్గుబాటి పురంధేశ్వరి కెమెరా స్విచాన్ చేశారు. గారపాటి లోకేశ్వరి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా అతిథులంతా చిత్ర బృందానికి శుభాకాంక్షలు అందించారు. NTR (న్యూ టాలెంట్ రోర్స్) పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మాటలు: సాయిమాధవ్ బుర్రా, సంగీతం: ఎం.ఎం.కీరవాణి, పాటలు: చంద్రబోస్, నిర్మాత: యలమంచిలి గీత.