Film On ‘Operation Sindoor | జమ్ము కశ్మీర్‌లోని పహల్గాం దాడి ఘటనకు సంబంధించి భారత సైన్యం ఇటీవల పాకిస్తాన్‌లోని ఉగ్ర స్థావరాలపై ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో మెరుపు దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ దాడిలో పాక్‌లో ఉన్న 9 ఉగ్ర స్థావరాలు ధ్వంసం కాగా.. 70 మందికి పైగా ఉగ్రవాదులు చనిపోయినట్లు సమాచారం. అయితే ఈ ఆపరేషన్ అనంతరం ‘ఆపరేషన్ సిందూర్’ టైటిల్ ట్రేడ్ మార్క్ కోసం పలు సంస్థలు పోటిపడుతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ తన బిజినెస్‌లో భాగంగా ‘ఆపరేషన్ సిందూర్’ ట్రేడ్ మార్క్‌ను దక్కించుకోవాలని చూస్తుండగా.. మరోవైపు ‘ఆపరేషన్ సిందూర్’ అనే టైటిల్‌ను దక్కించుకునేందుకు బాలీవుడ్‌కి చెందిన 15 అగ్ర నిర్మాణ సంస్థలు ఇండియన్ మోషన్ పిక్చర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (IMPPA)ను ఆశ్రయించాయి.
మహవీర్ జైన్ నిర్మాణ సంస్థ ఈ విషయంలో ముందుండగా, టి-సిరీస్, జీ స్టూడియోస్, మధుర్ భండార్కర్, అశోక్ పండిట్ వంటి ప్రముఖులు కూడా టైటిల్ కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో ఉన్నారు. గతంలో విడుదలైన సైనిక నేపథ్య చిత్రాల (ఉరి – ది సర్జికల్ స్ట్రైక్, ‘బోర్డర్’, ‘అమరన్’, ‘రాజీ’ ) విజయాన్ని దృష్టిలో ఉంచుకుని, “ఆపరేషన్ సిందూర్”కు బలమైన సినిమాటిక్ ఆకర్షణ ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
టైటిల్‌ను మొదట నమోదు చేసుకున్న వారికే దానిపై ఎక్కువ హక్కులు ఉంటాయని తెలుస్తోంది. దీంతో, ఈ ప్రతిష్టాత్మకమైన కథను వెండితెరపై ఎవరు ఆవిష్కరిస్తారో చూడటం ఆసక్తికరంగా మారింది. “ఉరి: ది సర్జికల్ స్ట్రైక్” వంటి విజయవంతమైన చిత్రాల తరహాలోనే ఈ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని భావిస్తున్నారు. తెలుగులోనూ ఇదే తరహా ఆసక్తి ఉండవచ్చని భావిస్తున్నప్పటికీ, ప్రత్యేకంగా 15 తెలుగు స్టూడియోలు టైటిల్ కోసం ప్రయత్నిస్తున్నట్లు నిర్ధారిత సమాచారం లేదు. జాతీయ ప్రాధాన్యత కలిగిన అంశం కావడంతో, దక్షిణాది పరిశ్రమలోనూ దీనిపై దృష్టి ఉండొచ్చు.