Tollywood | చిన్న సినిమాకు పుట్టెడు కష్టాలు. కథ బాగా కుదిరినా, అనుకున్న బడ్జెట్లో పూర్తయినా.. థియేటర్లలో విడుదలయ్యే వరకు అడుగడుగునా ఆటంకాలే ఎదురవుతాయి. ఇలాంటి చిత్రాలను తీసే దర్శక, నిర్మాతలకు అండగా నిలుస్తున్నది ప్రొడ్యూసర్ బజార్. ఇక్కడ సినిమాలు కొంటారు, అమ్ముతారు. మార్కెట్ చేస్తారు. సినిమాను నమ్ముకున్న వారికి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే పరిస్థితులు కల్పించడం, పెట్టిన డబ్బులు నష్టపోకుండా చూడటమే ప్రొడ్యూసర్ బజార్ పని.
ప్రొడ్యూసర్ బజార్ కాన్సెప్ట్ కరోనా కాలంలో పుట్టింది. లాక్డౌన్ వేళ ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. సమస్త వ్యవస్థలూ స్తంభించాయి. ఆ సమయంలో ఇద్దరు స్నేహితులు జీకే సెంథిల్ నాయగన్, తిరునవక్కరసు కలిసి ప్రొడ్యూసర్ బజార్ స్టార్టప్‌ను ప్రారంభించారు. ఒక కథను సినిమాగా రూపొందించడంలో దర్శకుడి శ్రమను, దానిని తెరకెక్కించడంలో నిర్మాత కష్టానికి తగిన ప్రతిఫలం దక్కేలా ఈ మిత్రద్వయం పాటుపడుతున్నారు. తిరునవక్కరసు సినీ నిర్మాత. తమిళంలో మూడు సినిమాలు నిర్మించాడు. క్రౌడ్ ఫండింగ్ ద్వారా సినిమా తీయొచ్చు. ఆ చిత్రం విజయవంతం అయితే అందరూ లాభపడతారు. అదే ఆడకపోతే.. అందరూ దర్శకుడిని నిలదీసినంత పని చేస్తారు. కానీ, ప్రొడ్యూసర్ బజార్ వల్ల అలాంటి పరిస్థితి రాదంటారు తిరునవక్కరసు.
‘సినిమా పూర్తయిన తర్వాత దర్శక నిర్మాతలు ప్రొడ్యూసర్ బజార్‌ను సంప్రదిస్తారు. దర్శకుడు, నిర్మాత మధ్య షరతులు, లాభనష్టాలు, వాటా వివరాలు.. ఇలా అన్ని ఒప్పందాలు చేసున్న సినిమాలనే మా జాబితాలో చేర్చుకుంటాం. ఆ సినిమాకు అవసరమైనంత మేరకు ప్రచారం నిర్వహించి, విడుదల చేస్తామ’ని ఆయన చెబుతారు. వందల కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమాల కోసం ప్రొడ్యూసర్ బజార్ పనిచేయదు. రూ.కోటి నుంచి రూ.10 కోట్ల బడ్జెట్లో నిర్మించిన చిత్రాలకు మాత్రమే అండగా ఉంటుంది. రిలీజ్ కష్టాలు లేకుండా చేస్తుంది. షరతులు బేఖాతరు కాకుండా కాపుకాస్తుంది. ఔత్సాహిక రచయితలకు అండగా నిలుస్తున్నది కూడా!