‘అమెరికాలో మాది సాఫ్ట్వేర్ కంపెనీ. క్రియేటివ్ వర్క్ చేస్తుంటాం. ఆ క్రియేటివిటీ మీద ఇష్టమే మమ్మల్ని సినిమాల వైపు నడిపించింది. క్రియేటివ్‌గా ఏదైనా కొత్తగా చేస్తున్నప్పుడు ఆ ఆనందం వేరుగా ఉంటుంది. కబడ్డీ నేపథ్యంలో ఇప్పటివరకూ కొన్ని కథలు వచ్చాయి. అయితే.. మా సినిమాలో చూపించినంత సీరియస్‌గా ఇప్పటివరకూ ఏ సినిమాలో చూపించలేదు. కచ్ఛితంగా ఒక బెంచ్ మార్క్ మూవీ అవుతుంది.’ అని నమ్మకం వ్యక్తం చేశారు నిర్మాత శ్రీని గుబ్బల. విజయ రామరాజు టైటిల్‌రోల్ పోషించిన స్పోర్ట్స్ డ్రామా ‘అర్జున్ చక్రవర్తి’. విక్రాంత్ రుద్ర దర్శకుడు. ఈ నెల 29న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో విలేకరులతో ముచ్చటించారు నిర్మాత శ్రీని గుబ్బల.
‘నల్గొండలో నాగులయ్య అనే అద్భుతమైన కబడ్డీ ప్లేయర్ ఉన్నాడు. అతడ్ని అర్జున్ అని కూడా పిలుస్తారు. అతని జీవితంలో జరిగిన యధార్థ సంఘటనలు 60శాతం తీసుకొని, దానికి ఓ 40శాతం ఫిక్షన్ జోడించి ఈ కథ తయారు చేశాం. ఈ కథలో హీరోకి నాలుగైదు ట్రాన్సర్మేషన్స్ ఉన్నాయి. ప్రతి మార్పుకూ 9 నెలల సమయం పట్టింది. ఒక దశలో తను హాస్పిటలైజ్ అయ్యారు కూడా. ఇంతకష్టపడి చేశాం కాబట్టే ఈ సినిమాకు విడుదలకు ముందే 46 ఇంటర్నేషనల్ అవార్డులొచ్చాయి. డైరెక్టర్ విక్రాంత్ పాషన్ ఉన్న మేకర్. సినిమాను అద్భుతంగా తీశాడు. అన్ని విధాలుగా సినిమా ఆకట్టుకుంటుంది.’ అని తెలిపారు శ్రీని గుబ్బల.