‘నిర్మాతగా నా కెరీర్లో మైలురాయిలాంటి సినిమా ఇది. నాన్నతో ఈ సినిమా తీయడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. ఈ సంక్రాంతికి సకుటుంబ చిత్రంగా అలరిస్తుంది’ అని చెప్పారు అగ్ర నటుడు చిరంజీవి తనయ సుస్మిత కొణిదెల. మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’ ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకురానుంది. అనిల్ రావిపూడి దర్శకుడు. ఈ చిత్రాన్ని సాహుగారపాటితో కలిసి సుస్మిత కొణిదెల నిర్మించారు. ఈ సందర్భంగా మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో నిర్మాతలిద్దరూ విలేకరులతో ముచ్చటించారు. సుస్మిత కొణిదెల మాట్లాడుతూ ‘ఈ సినిమాలో నాన్న తన వింటేజ్ ఛార్మ్ని గుర్తు చేస్తారు.
ఈతరం వారు కూడా చిరంజీవి తాలూకు రియల్ మ్యాజిక్‌ను చూడబోతున్నారు. ‘రౌడీ అల్లుడు’ సినిమా తరహాలో ఆయన చక్కటి కామెడీ పండించారని ట్రైలర్ చూసిన వారు చెబుతున్నారు. ఈ సినిమా కోసం నాన్న బరువు తగ్గడంతో పాటు ఫిట్‌నెస్‌పై బాగా శ్రద్ధ తీసుకున్నారు. చాలా స్లిమ్‌గా తయారయ్యారు. ఇక వెంకటేష్ పాత్ర ఇంపాక్ట్ ఫుల్‌గా ఉంటుంది. ఆయన ఎంట్రీ తర్వాత మరింత ఫన్‌గా మూవీ సాగుతుంది. సినిమాలకు సంబంధించిన నాన్న దగ్గరి నుంచి ప్రతీ రోజు ఓ పాఠం నేర్చుకోవచ్చు. నిర్మాతగా ఈ జర్నీలో చాలా విషయాల్ని తెలుసుకున్నా. అనుకున్నది సాధించాలంటే ప్రాణం పెట్టి పనిచేయాలని అర్థం చేసుకున్నా’ అన్నారు.
ఈ సినిమా విషయంలో చిరు, వెంకీ ఫ్యాన్స్ ఇద్దరూ చాలా హ్యాపీగా ఉన్నారని అన్నారు నిర్మాత సాహు గారపాటి. సంక్రాంతి పోటీలో థియేటర్ల పరంగా ఎలాంటి సమస్యలు ఎదురుకాలేదని, తమకు రన్నింగ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారని ఆయన తెలిపారు. ట్రైలర్ జస్ట్ శాంపిల్ మాత్రమేనని, సినిమా ఆద్యంతం ఫన్రైడ్లా ఉంటుందన్నారు. బుధవారం జరిగే ప్రీరిలీజ్ ఈవెంట్‌కు చిరంజీవి, వెంకటేష్ ఇద్దరూ వస్తున్నారని, మున్ముందు ప్రమోషన్స్‌లో కూడా పాల్గొంటారని తెలిపారు. టికెట్ రేట్స్‌పై స్పష్టత వచ్చిన తర్వాత ప్రీమియర్స్ వివరాలను వెల్లడిస్తామని సాహు గారపాటి పేర్కొన్నారు.