‘ఒక ఫీమేల్ సూపర్‌స్టార్‌తో భారీ కమర్షియల్ సినిమా చేయాలనుకున్నాం. ఇప్పుడున్న కథానాయికల్లో అనుష్కకు తిరుగులేని స్టార్డమ్ ఉంది. ఇందులో ఆమె పర్ఫార్మెన్స్ పవర్‌ఫుల్‌గా ఉంటుంది’ అన్నారు నిర్మాత రాజీవ్ రెడ్డి. ఫస్ట్‌ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అనుష్క ప్రధాన పాత్రలో రూపొందించిన చిత్రం ‘ఘాటి’. క్రిష్ జాగర్లమూడి దర్శకుడు. రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మాతలు. సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా సోమవారం నిర్మాత రాజీవ్ రెడ్డి పాత్రికేయులతో ముచ్చటించారు. ఇది పూర్తిగా కాల్పనిక కథాంశమని, నిజ జీవిత ఘటనలతో ఎలాంటి సంబంధం ఉండదని తెలిపారు. ‘శ్రీకాకుళం ప్రాంతంలో గంజాయి బ్యాక్‌డ్రాప్‌లో నడిచే కథ ఇది. గంజాయిని రవాణా చేసే ఘాటి అనే తెగ చుట్టూ కథ నడుస్తుంది. ఆంధ్ర, ఒరిస్సా సరిహద్దుల్లో ఎక్కువగా షూటింగ్ జరిపాం. దర్శకుడు క్రిష్ శైలిలో సాగే ఫుల్ యాక్షన్ సినిమా ఇది. ఒరిస్సాలో షూటింగ్ చేస్తున్నప్పుడు వేలాది జనం అనుష్కను చూడ్డానికి వచ్చారు. వారిని కంట్రోల్ చేయడానికి పోలీసులు లాఠీఛార్జ్ చేయాల్సి వచ్చింది. అనుష్కకు దేశవ్యాప్తంగా క్రేజ్ ఉందనడానికి అదొక ఉదాహరణగా చెప్పొచ్చు’ అని అన్నారు. ‘ఘాటి’లో విజువల్స్ అద్భుతంగా ఉంటాయని, ప్రేక్షకుల అంచనాలను అందుకుంటుందనే విశ్వాసం ఉందని రాజీవ్ రెడ్డి పేర్కొన్నారు.