అగ్ర హీరో, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ తమకు పెద్దన్నలాంటివాడని, ఆయన తిడితే పడతామని, పవన్ హర్ట్ అయ్యారు కాబట్టి తిట్టే అధికారం ఆయనకుందని అన్నారు ప్రముఖ నిర్మాత దిల్ రాజు. తెలుగు సినీరంగానికి, ఏపీ ప్రభుత్వానికి మధ్య చోటుచేసుకున్న తాజా వివాదం నేపథ్యంలో సోమవారం హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో దిల్‌రాజు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఇండస్ట్రీకి చెందిన వారెవరూ ఇప్పటివరకు ఏపీ ముఖ్యమంత్రిని కలవలేదని పవన్‌కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై దిల్‌రాజు పైవిధంగా స్పందించారు. ఇక్కడ (ఇండస్ట్రీలో) ఎవరి దారి వారిదేనని, ఏమైనా సమస్యలొస్తేనే ప్రభుత్వాన్ని, ఛాంబర్‌ను ఆశ్రయిస్తారని దిల్‌రాజు అన్నారు. ‘తమ డిమాండ్లు నెరవేరకుంటేనే బంద్ చేస్తామని ఎగ్జిబిటర్లు చెప్పారు. అంతలోనే జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ అంటూ బ్రేకింగ్ న్యూస్ వచ్చాయి. ఆ వార్తలను ఎగ్జిబిటర్లు, ఛాంబర్ ఖండించలేదు. ఇండస్ట్రీలో ఎవరి దారి వారిదే. ఇండస్ట్రీలో ఉన్న అందరం కలిసి కదా మీడియాతో మాట్లాడాల్సింది. అంతా కలిసి మాట్లాడాలంటే మాకు భయం’ అని దిల్‌రాజు చెప్పారు. ఇరవైఏళ్లుగా తాను పవన్‌కల్యాణ్‌ను చూస్తున్నానని, ఆయనకు ఆగ్రహం తెప్పించేలా పరిస్థితులు ఏర్పడ్డాయని, పవన్ చిత్రాన్ని ఉద్దేశ్యపూర్వకంగా టార్గెట్ చేశారంటూ దుష్ప్రచారం జరిగిందని, అయితే వాస్తవాలు వేరుగా ఉన్నాయన్నారు. ‘థియేటర్స్ బంద్ అనే వార్త రాంగ్గా కమ్యూనికేట్ అయింది.
తూర్పు గోదావరిలో మొదలైన సమస్యను తెలంగాణకు ఆపాదించారు. ఏప్రిల్ 19న తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు మీటింగ్ జరిపారు. పర్సంటేజీ విధానం బాగుంటుందని ఎగ్జిబిటర్లు కోరారు. డిస్ట్రిబ్యూటర్లు అంగీకారం చెప్పలేదు. సరిగ్గా అదే సమయంలో ‘హరిహర వీరమల్లు’ రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. ఆ తర్వాత వాయిదా వేశారు. పర్సంటేజీల సమస్య ఈస్ట్ గోదావరిలో మొదలై తెలంగాణ దాకా వచ్చింది. ఈ అంశాన్ని ఇక్కడి ఎగ్జిబిటర్లు శిరీష్ దృష్టికి తీసుకొచ్చారు. మే 18న ఛాంబర్ మీటింగ్ జరిగింది. చివర్లో నేను అక్కడకు వెళ్లాను. జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ చేస్తామని ఎగ్జిబిటర్లు చెబితే వద్దని వారించాను. అందరూ నాతో ఏకీభవించారు. పర్సంటేజీల విషయంలో ఎగ్జిబిటర్లు ఛాంబర్‌కు లేఖ రాశారు. వాళ్లు అనుకున్నది జరగకపోతే బంద్ చేస్తామన్నది ఆ లేఖ సారాంశం. కానీ బయట జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ అనే వార్త ప్రచారంలోకి వచ్చింది. ఆ తర్వాత జరిగిన నిర్మాతల మీటింగ్‌లో ఎగ్జిబిటర్లకు సమస్యలున్నాయని అందరూ చెప్పారు. జాయింట్ మీటింగ్‌లో స్పష్టతనిద్దామని అనుకునేలోగా ‘హరిహరవీరమల్లు’ సినిమాపై ఇష్యూ డైవర్ట్ అయింది. పవన్‌కల్యాణ్ సినిమాను ఆపే దమ్ము, ధైర్యం ఎవరికీ లేదు. ఒక్క కోవిడ్ సమయంలో తప్పితే థియేటర్ల బంద్ అనేది నా అనుభవంలో ఎప్పుడూ చూడలేదు’ అని దిల్ రాజు పేర్కొన్నారు.
నైజాంలో 370 సింగిల్ స్క్రీన్స్ థియేటర్లు ఉంటే అందులో తమ సంస్థ ఎస్వీసీఎస్కు 30 మాత్రమే ఉన్నాయని, ఏషియల్, సురేష్ కంపెనీలో 90 వరకూ ఉన్నాయని దిల్‌రాజు చెప్పారు. ‘250 థియేటర్లను యజమానులే నడుపుకుంటున్నారు. అయినా ‘ఆ నలుగురు’ అంటూ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఈ విషయంలో ఇక్కడ స్పష్టతనిస్తున్నా. ఉత్తరాంధ్రలో మాకు డిస్ట్రిబ్యూషన్ ఆఫీసు ఉంది. అక్కడ 20 థియేటర్లు ఉన్నాయి. ప్రస్తుతం రెండు ప్రభుత్వాలు ఇండస్ట్రీకి అండగా ఉన్నాయి. ఇండస్ట్రీకి ఏ సమస్య వచ్చినా ప్రభుత్వాలే పరిష్కరించాలి. ఇంతటితో ఈ వివాదానికి ముగింపు పలుకుతారని ఆశిస్తున్నా’ అని దిల్‌రాజు అన్నారు.