గత కొన్ని రోజులుగా తెలుగు సినీ ప్రముఖుల ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ డిపార్ట్మెంట్ అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ప్రముఖ నిర్మాత దిల్ రాజు సంస్థల్లో కూడా ఐటీ సోదాలు జరిగాయి. ఈ నేపథ్యంలో శనివారం దిల్ రాజు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఐటీ సోదాల విషయంలో అసత్యాలను ప్రచారం చేస్తున్నారని, మీడియా సంస్థలు వాస్తవాలను తెలుసుకొని ప్రసారం చేయాలని ఆయన కోరారు. ఐటీ దాడుల విషయంలో తనపై వస్తున్న ఆరోపణలు, రూమర్స్‌పై కూడా దిల్‌రాజు స్పందించారు.
ఆయన మాట్లాడుతూ ‘ఐటీ సోదాలు సాధారణంగా జరిగే వ్యవహారమే. తెలిసీతెలియని విషయాలతో కొందమంది వీటిపై తప్పుడు సమాచారాన్ని అందిస్తున్నారు. 2008లో మాపై ఐటీ రైడ్స్ జరిగాయి. పదహారేళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ సోదాలు నిర్వహించారు. ఏ వ్యాపారరంగంలో ఉన్నా ఇలాంటి రైడ్స్ జరగడం సాధారణం. ఈ దాడుల్లో విలువైన డాక్యుమెంట్స్ దొరికాయని, కోట్ల రూపాయల నగదు లభ్యమైందని ప్రచారం చేశారు. అవన్నీ అవాస్తవాలే. మావద్ద అధికారులు ఎలాంటి అనధికార డాక్యుమెంట్లు, డబ్బును గుర్తించలేదు. డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్‌కు సంబంధించిన డాక్యుమెంట్స్ అడిగారు.
అన్నింటిని చూపించాం. నా వద్ద 5లక్షలు, సోదరుడు శిరీష్ వద్ద నాలుగున్నర లక్షలు, మా కుమార్తె వద్ద ఆరున్నర లక్షలు, ఆఫీస్‌లో మరో రెండున్నర లక్షలు..మొత్తం 20లక్షల కంటే తక్కువ డబ్బే ఉంది. అది అనధికారం కాదు. వాటికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ మా వద్ద ఉన్నాయి. బంగారం కూడా పరిమితి ప్రకారమే ఉంది. గత ఐదేళ్లుగా మేము ఎక్కడా ఆస్తులు కొనుగోలు చేయలేదు. పెట్టుబడులు కూడా పెట్టలేదు. ఈ విషయాలన్నీ ఐటీ అధికారులకు తెలియజేశాం. వారికి పూర్తిగా సహకరించాం. మా కుటుంబ సభ్యుల అకౌంట్స్ అన్నీ క్లియర్‌గా ఉన్నాయి’ అని చెప్పారు.
సినిమాలకు సంబంధించి ఫేక్ కలెక్షన్ల వల్లే ఐటీ దాడులు జరుగుతున్నాయనే విషయంపై దిల్‌రాజు స్పందించారు. ‘ప్రస్తుతం 90శాతం టికెట్లు ఆన్లైన్ ద్వారానే అమ్ముడవుతున్నాయి. అలాంటప్పుడు బ్లాక్‌మనీ సమస్య లేదు. ఈ విషయంపై నేను వ్యక్తిగతంగా మాట్లాడకూడదు. ఇండస్ట్రీలోని అందరం కలిసి మాట్లాడతాం’ అని దిల్ రాజు చెప్పారు. ఇటీవల తన తల్లి ఊపిరితిత్తుల సమస్య వల్ల ఆసుపత్రిలో చేరిందని, ఆమెకు గుండెపోటు అంటూ వార్తలు రాశారని, ఆమె వయసు 81 ఏళ్లు..ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంగా ఉందని ఆయన తెలిపారు. ‘అమ్మ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చారు. కొందరు వాస్తవాలు తెలుసుకోకుండా ఇష్టమొచ్చినట్లు వార్తలు రాస్తున్నారు. నిజాలు తెలుసుకొని వార్తలు రాయండి’ అని దిల్ రాజు కోరారు.