Producer | టాలీవుడ్లో ఇటీవల నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య కొనసాగుతున్న ‘పర్సంటేజ్ విధానం’ వివాదం పెద్ద చర్చగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు స్టార్ నిర్మాతలు కలిసి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను రాజమండ్రిలో కలవడం ఇండస్ట్రీలో ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ భేటీపై ఇప్పుడు నిర్మాత ధీరజ్ మొగిలినేని ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్‌గా మారింది.ఇటీవల మైత్రీ మూవీ మేకర్స్ రవిశంకర్, సితార ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ, షైన్ స్క్రీన్స్ సాహు గారపాటి, వృద్ధి సినిమాస్ వెంకట్ సతీశ్ కిలారు, ఎస్ఎల్వీ సినిమాస్ చెరుకూరి సుధాకర్ తదితర ప్రముఖ నిర్మాతలు పవన్ కళ్యాణ్‌తో సమావేశమయ్యారు. చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం నెలకొన్న సమస్యలు, ముఖ్యంగా సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ‘పర్సంటేజ్ విధానం’ అంశంపై చర్చించినట్లు సమాచారం.
అయితే ఈ భేటీలో చిన్న, మీడియం రేంజ్ నిర్మాతలకు ప్రాతినిధ్యం లభించలేదని నిర్మాత ధీరజ్ మొగిలినేని అభిప్రాయపడ్డారు. బుధవారం హైదరాబాద్‌లో జరిగిన ‘సమ్మర్ హాలిడేస్’ సినిమా టీజర్ లాంచ్ కార్యక్రమంలో ఆయన ఈ విషయంపై స్పందించారు.“మాకు కూడా చాలా సమస్యలు ఉన్నాయి. రూ.100 కోట్లకు పైగా బడ్జెట్‌తో సినిమాలు తీసే పెద్ద నిర్మాతల సమస్యలు వేరు. చిన్న, మీడియం రేంజ్ సినిమాలు నిర్మించే నిర్మాతల సమస్యలు మరోలా ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారిని కలిసేందుకు వెళ్లినప్పుడు మాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. మమ్మల్ని ఎవర్నీ పిలవలేదు. కేవలం వాళ్లే వెళ్లారు” అంటూ ధీరజ్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
తన అభిప్రాయాన్ని వివరించేందుకు ఆయన ఆసక్తికర ఉదాహరణ కూడా చెప్పారు. “జూబ్లీహిల్స్‌లో 1000 గజాల ప్లాట్‌లో రూ.10 కోట్లతో ఇల్లు కట్టుకునేవారి సమస్యలు ఒకలా ఉంటాయి. మణికొండలో 250 గజాల ప్లాట్‌లో ఇల్లు కట్టుకునేవాడి సమస్యలు మరోలా ఉంటాయి. ఇద్దరూ ఇళ్లే కడుతున్నారు కానీ పరిస్థితులు, అవసరాలు వేరు. అలానే పెద్ద సినిమాలు తీసేవారి సమస్యలు వేరు.. చిన్న నిర్మాతల సమస్యలు వేరు” అని వ్యాఖ్యానించారు. ఇక ప్రస్తుతం జరుగుతున్న పర్సంటేజ్ వివాదంలో చిన్న నిర్మాతల ఇబ్బందులను ఎవరూ సరిగా అర్థం చేసుకోవడం లేదని ధీరజ్ అన్నారు. త్వరలోనే చిన్న, మీడియం రేంజ్ నిర్మాతలంతా కలిసి పవన్ కళ్యాణ్‌ను కలసి తమ సమస్యలను వివరించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా పైరసీ సమస్యపై కూడా ఆయన స్పందించారు. సినీ పరిశ్రమకు పైరసీ పెద్ద ముప్పుగా మారిందని, దీనిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కూడా మాట్లాడేందుకు పవన్ కళ్యాణ్ సహకారం తీసుకుంటామని వెల్లడించారు.