‘సినిమాల మీద పాషన్‌తో ఇండస్ట్రీలోకి వచ్చాను. మంచి కంటెంట్ ఉన్న చిత్రాలను ప్రేక్షకులకు అందించాలన్నదే నా లక్ష్యం’ అన్నారు నిర్మాత డి.మధు. ఆయన నిర్మించిన తాజా చిత్రం ‘ఓదెల-2’ ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకురానుంది. తమన్నా నాగసాధువు పాత్రలో డివోషనల్గా థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సంపత్‌నంది సూపర్విజన్లో అశోక్‌తేజ డైరెక్ట్ చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో నిర్మాత డి.మధు పాత్రికేయులతో ముచ్చటించారు. ‘ఓదెల’ తొలిభాగం తనను బాగా ఎక్సైట్ చేసిందని, అందుకే సీక్వెల్లో భాగమయ్యానని ఆయన తెలిపారు.
నాగసాధువు పాత్రలో తమన్నా పర్ఫార్మెన్స్ హైలైట్‌గా నిలుస్తుందని, కథలో ప్రతీ పాత్రకు ప్రాధాన్యత ఉంటుందని, పంచభూతాల కాన్సెప్ట్‌ని గ్రాఫిక్స్‌లో చూపించడం థ్రిల్లింగ్‌గా అనిపిస్తుందని చెప్పారు. ‘ఇది సూపర్‌నేచురల్ కథ అయినా..ఎక్కడా లాజిక్ మిస్ చేయకుండా తెరకెక్కించాం. అన్నింటిని ఆధారాలతో చూపించాం. నిర్మాణంలో ఎక్కడా రాజీపడకుండా గ్రాండ్ స్కేల్లో సినిమాను తెరకెక్కించాం. సినిమా ప్రమోషన్స్ కూడా వినూత్నంగా నిర్వహిస్తున్నాం. మహాకుంభమేళాలో టీజర్‌ను లాంచ్ చేశాం. అంత రిస్క్ ఎందుకు చేశారని చాలా మంది అడిగారు. నా దృష్టిలో ఎక్కడైతే రిస్క్ ఉంటుందో అక్కడే సక్సెస్ ఉంటుంది. భవిష్యత్తు సంపత్‌నందితో కలిసి మరిన్ని సినిమాలు చేస్తా’ అని డి.మధు తెలిపారు.