విజయ్ సేతుపతి అతిథి పాత్రలో వెట్రిమారన్ దర్శకత్వంలో రూపొందిన ‘విడుదల 1’ తెలుగు, తమిళ భాషల్లో విడుదలై ప్రేక్షకుల ప్రశంసలందుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ ‘విడుదల 2’ రానుంది. ఈ సెకండ్ పార్ట్‌లో విజయ్ సేతుపతే కథానాయకుడు కావడం గమనార్హం. శ్రీవేధాక్షర మూవీస్ పతాకంపై చింతపల్లి రామారావు ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ నెల 20న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిశారు. నిర్మాత చింతపల్లి రామారావు మాట్లాడుతూ ‘అణచివేత నుంచి ఉద్భవించిన వీర విప్లగాధ ఇది. ఒక్క తమిళనాటే కాదు, తెలుగునేలపై కూడా సామాన్యులు ఎదుర్కొంటున్న సమస్యలు, సంఘటనల ఆధారంగా వెట్రిమారన్ ఈ సినిమా తీశారు. ఇందులో నక్సలైట్ నాయకుడు పెరుమాళ్‌గా విజయ్‌సేతుపతి విశ్వరూపం చూస్తారు. వెట్రిమారన్ దర్శకత్వ ప్రతిభ, ఇళయరాజా సంగీతం ప్రత్యేక ఆకర్షణ’ అన్నారు.