నటనకు ఆస్కారమున్న వైవిధ్యమైన పాత్రలను తాను చేయగలనని నిరూపించే చిత్రమిదని చెప్పింది ప్రియాంక జవాల్కర్. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘గమనం’. సుజనారావు దర్శకురాలు. ఈ నెల 10న విడుదలకానుంది. ఆదివారం హైదరాబాద్‌లో ప్రియాంకజవాల్కర్ పాత్రికేయులతో ముచ్చటిస్తూ ‘సంప్రదాయాలకు విలువనిచ్చే ముస్లిం కుటుంబంలో పుట్టిన జారా అనే అమ్మాయిగా ఈ సినిమాలో నేను కనిపిస్తా. ఇందులో నా పాత్రకు సంభాషణలు తక్కువగా ఉంటాయి. కళ్లతోనే హావభావాలు పలికించడం చాలెంజింగ్‌గా అనిపించింది. ఈ పాత్ర కోసం ‘మళ్లీ మళ్లీ ఇది రానిరోజు’లో నిత్యామీనన్‌ను రిఫరెన్స్‌గా తీసుకున్నా. నా స్నేహితుల్లో కొందరు ముస్లిం అమ్మాయిలు ఉండటంతో వారి వస్త్రధారణ, మాట తీరు ఎలా ఉంటాయో తెలుసుకొని నటించా. భిన్న మతానికి చెందిన క్రికెటర్‌తో జారా ఎలా ప్రేమలో పడింది?అడ్డంకులను ఎదుర్కొని వారు ఎలా ఏకమయ్యారన్నది ఆసక్తికరంగా ఉంటుంది. నేను కమర్షియల్ సినిమాలు, గ్లామర్ పాత్రలు మాత్రమే చేయగలననే అపోహ చాలా మందిలో ఉంది. ఈ సినిమాతో ఆ ముద్ర తొలగిపోతుందని అనుకుంటున్నా. నాలోని నటనాప్రతిభను పూర్తిస్థాయిలో ప్రదర్శించే అవకాశం ఈ సినిమాతో దొరికింది’ అని చెప్పింది.