Priyanka Chopra | దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్లో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపుదిద్దుకుంటున్న భారీ విజువల్ వండర్ ‘వారణాసి’. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ముగింపు దశకు చేరుకున్న తరుణంలో, చిత్ర కథానాయిక ప్రియాంక చోప్రా చేసిన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ ప్రాజెక్ట్ కోసం గత 14 నెలలుగా పనిచేస్తున్నట్లు తెలిపిన ఆమె, రాజమౌళి ప్రతి సన్నివేశాన్ని ఎంతో క్లారిటీతో, పకడ్బందీగా తెరకెక్కిస్తారని కొనియాడారు. ఈ సినిమా కోసం తాను అద్భుతమైన స్లో మోషన్ జంప్స్ కూడా చేసినట్లు పేర్కొంటూ, అంతకు మించి వివరాలను మాత్రం ప్రస్తుతానికి వెల్లడించలేనని తెలిపారు. అయితే ప్రియాంక చేసిన ఈ స్లో మోషన్ జంప్స్ ఏ యాక్షన్ సీక్వెన్స్‌లో భాగం అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మరోవైపు ఈ చిత్రానికి సంబంధించిన కీలకమైన సన్నివేశాల చిత్రీకరణ ఇప్పటికే పూర్తయినట్లు దర్శకుడు రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీతో పాటు అన్నపూర్ణ స్టూడియోస్‌లో వేసిన భారీ సెట్లలో ఆఖరి నిమిషం షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. జక్కన బృందం వీలైనంత త్వరగా చిత్రీకరణను ముగించి, అంతర్జాతీయ స్థాయిలో సినిమాను ప్రమోట్ చేయడానికి పక్కా యాక్షన్ ప్లాన్‌తో సిద్ధమవుతోంది. కాగా, ఈ చిత్రాన్ని 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. దుర్గా ఆర్ట్స్ పతాకంపై సీనియర్ నిర్మాత కె.ఎల్. నారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మహేశ్ బాబు ‘రుద్ర’గా, ప్రియాంక చోప్రా ‘మందాకిని’గా నటిస్తుండగా, మలయాళ స్టార్ పృథ్విరాజ్ సుకుమారన్ ‘కుంభ’ అనే శక్తివంతమైన విలన్ పాత్రలో కనిపించనున్నారు. సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
Priyanka Chopra about #Varanasi Movie Experience
” I have shot more slow-mo shots in the movie ” https://t.co/AdS097exd7
— NTNINE (@Natrollsnine) July 15, 2026