హిందీ చిత్రసీమలో ఒకప్పుడు అగ్ర కథానాయికగా రాణించింది ప్రియాంక చోప్రా. నిక్ జోనస్‌తో వివాహానంతరం లాస్ఏంజిల్స్కు మకాం మార్చి హాలీవుడ్లో కూడా గుర్తింపును సంపాదించుకుంది. అభిమానులు ఈ భామను గ్లోబల్ స్టార్ అంటూ అభివర్ణిస్తారు. గత కొంతకాలంగా హాలీవుడ్ సినిమాలు, వెబ్సిరీస్లకే ప్రాధాన్యతనిస్తున్నది ప్రియాంక చోప్రా.
భవిష్యత్తులో ఈ అమ్మడు హిందీ పరిశ్రమకు గుడ్‌బై చెప్పనుందని ముంబయి సినీ వర్గాల్లో వినిపిస్తున్నది. ఈ వార్తలకు బలం చేకూర్చేలా ముంబయిలోని తన ఆస్తులను వరుసగా అమ్మకానికి పెడుతున్నది ప్రియాంక. తాను ఎంతో ఇష్టపడి డిజైన్ చేసుకున్న ఆంధేరిలోని ఖరీదైన ప్లాట్‌ను కూడా ఇటీవలే పదికోట్లకు విక్రయించింది. అలాగే ఓ కమర్షియల్ ప్రాపర్టీని కూడా అమ్మేసిందట.
ఈ నేపథ్యంలో ప్రియాంక చోప్రా హిందీ చిత్రసీమకు దూరం కాబోతున్నదనే ప్రచారం జరుగుతున్నది. హాలీవుడ్లో వరుసగా భారీ ఆఫర్స్ రావడం.. హిందీ ఇండస్ట్రీలో అంతగా అవకాశాలు లేకపోవడంతో లాస్ఏంజిల్స్ కేంద్రంగానే కెరీర్‌ను కొనసాగించాలనే నిర్ణయానికి వచ్చిందని చెబుతున్నారు. ప్రస్తుతం ప్రియాంక చోప్రా ‘హెడ్స్ ఆఫ్ స్టేట్’ అనే హాలీవుడ్ చిత్రంలో నటిస్తున్నది.