Priyanka Chopra | ప్రపంచవ్యాప్తంగా స్టార్డమ్ సంపాదించిన గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రాకు తెలుగు ప్రేక్షకులలోను ప్రత్యేక గుర్తింపు ఉంది. మోడల్‌గా కెరీర్ ప్రారంభించి, ఆ తర్వాత బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు తనదైన ముద్ర వేసుకున్న ఆమె మహేష్ బాబు- ఎస్.ఎస్.రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ చిత్రం వారణాసిలో మందాకిని అనే కీలక పాత్రలో కనిపించనున్నారు. మహేష్ బాబు కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు. మాలీవుడ్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నారు.ఇటీవల ఈ మూవీకి సంబంధించిన ఈవెంట్ భారీ ఎత్తున జరిగింది. దీంతో సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఈవెంట్లో ప్రియాంక తన లుక్‌తో ఆకట్టుకుంది.
అయితే ఒకవైపు వారణాసి చిత్రం చేస్తున్న ప్రియాంక చోప్రా ఇప్పుడు మరో తెలుగు సినిమాకి సైన్ చేసిందని అంటున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న కల్కి 2 కోసం ఆమెని సంప్రదించగా దానికి ప్రియాంక గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అంటున్నారు. కల్కి తొలి పార్ట్‌లో నటించిన దీపికా పదుకొణే పలు కారణాల వలన తప్పుకోవడంతో ఆ స్థానంలో ప్రియాంకని తీసుకుంటున్నట్టు టాక్.సీక్వెల్లో కమల్ హాసన్ విలన్‌గా కనిపించి తన నటనతో ప్రేక్షకుల మైండ్ బ్లాక్ చేయనున్నాడు. సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. మరి ప్రియాంక ఇందులో నటించనుందని వస్తున్న వార్తలలో నిజం ఎంత ఉందనేది తెలియాల్సి ఉంది.
2000లో మిస్ వరల్డ్‌గా కిరీటాన్ని గెలుచుకున్న ప్రియాంక, తర్వాత హిందీ చిత్రాల్లో వరుస విజయాలు సాధించారు. ఫ్యాషన్ చిత్రంతో జాతీయ ఉత్తమ నటి అవార్డును గెలుచుకుని దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందారు. ఆ తర్వాత హాలీవుడ్లో క్వాంటికో, బేవాచ్, సిటాడెల్ వంటి ప్రాజెక్టులతో అంతర్జాతీయ స్థాయిలో స్టార్డమ్ సంపాదించారు. రామ్ చరణ్‌తో కలిసి ఆమె నటించిన జంజీర్ రీమేక్‌తో టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితురాలయ్యారు. ఆ చిత్రం తెలుగులో తుఫాన్‌గా విడుదలైంది. ఆసక్తికర విషయమేమిటంటే ప్రియాంక చోప్రా 2002లో ‘అపురూపం’ అనే తెలుగు చిత్రానికి హీరోయిన్గా ఎంపికయ్యారు. ప్రసన్న హీరోగా, సాయి రవి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాలు కూడా షూట్ చేశారు. పోస్టర్లు కూడా విడుదలయ్యాయి. అయితే ఆర్ధిక ఇబ్బందుల కారణంగా ప్రాజెక్ట్ మధ్యలోనే ఆగిపోయి ప్రేక్షకుల ముందుకు రాలేదు.