తమ రూపాన్ని మెరుగుపరుచుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని అంటున్నది బుల్లితెర నటి ప్రియాంక చాహర్ చౌదరి. సర్జరీలతో శరీరాన్ని నాజూకుగా మలుచుకున్నదంటూ.. ప్రియాంకపై కొద్దికాలంగా సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. తనపై వస్తున్న రూమర్లపై స్పందించింది ప్రియాంక. “సర్జరీలతో నా రూపాన్ని మార్చుకున్నానని కొందరు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. చాలాకాలంగా ఇలాంటి మాటలు వింటూనే ఉన్నాను. కానీ, అవన్నీ వాస్తవాలు కాదు” అంటూ చెప్పింది. “గతేడాది నా ఆరోగ్యం బాగోలేక ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నాను. ఎక్కువ మోతాదులో యాంటి బయాటిక్స్ తీసుకోవాల్సి వచ్చింది.
అయితే, చాలా మందికి ఈ విషయం తెలియదు. వాటి ప్రభావం వల్లే నేను బరువు తగ్గాను. నా ముఖంలోనూ కొద్దిగా మార్పులు వచ్చాయి. దానికే కొందరు ఏదేదో ఊహించుకుంటున్నారు. నాపై లేనిపోని ఆరోపణలు గుప్పిస్తున్నారు” అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఇక ప్రతి ఒక్కరికీ తమ రూపాన్ని మెరుగుపరుచుకునే హక్కు ఉందనీ, అది పూర్తిగా వారి ఇష్టమేనని స్పష్టం చేసింది. “నేను కళ్లకు కాజల్ అద్దుకున్నా, లెన్స్ పెట్టుకున్నా.. ముఖానికి ఏదో చేయించుకున్నానని అనుకుంటారు. అందుకే నేను చెప్పేదేంటంటే.. నా ముఖం.. నా ఇష్టం!” అంటూ ఘాటుగా స్పందించింది. అయినా, తన ముఖానికి మేకప్ తప్ప ఏదీ చేయలేదనీ, అయినప్పటికీ కొందరు నమ్మడం లేదనీ వాపోయింది. ఇంకా ఏదేదో మాట్లాడుతూనే ఉంటారనీ, అలా గాసిప్స్‌ను ప్రచారం చేయడం సరైన పద్ధతికాదని హితవుపలికింది.