Priyanka Arul Mohan | సినీ తారలకు అభిమానులే బలం. అయితే ఒక్కోసారి వారివల్లే చిక్కుల్లో పడుతుంటారు. హద్దుమీరిన అభిమానం సెలబ్రిటీలకు కోపాన్ని తెప్పిస్తుంది. అలాంటి పరిస్థితినే ఎదుర్కొంది కథానాయిక ప్రియాంక అరుళ్ మోహన్. ఇటీవల చెన్నైలో జరిగిన ఓ సినిమా వేడుకలో పాల్గొంది ప్రియాంక. ఓ అభిమాని ఆమె దగ్గరకు వచ్చి సెల్ఫీ తీసుకునే ప్రయత్నం చేయగా వొద్దని వారించింది. అంతేకాకుండాఅక్కడి నుంచి వెంటనే వెళ్లిపోవాలని హెచ్చరించింది. ఈ సంఘటనతో అక్కడ ఏం జరుగుతుందోనని అతిథులందరూ టెన్షన్ పడ్డారు.
ఆ వేడుకలో పాల్గొన్న సీనియర్ నటి శరణ్య ఈ విషయం గురించి వాకబు చేసింది. దాంతో అసలు సంగతి బయటికొచ్చింది. సదరు అభిమాని అంతకుముందు రోజు కూడా ప్రియాంక మోహన్ వెంటపడ్డాడట. షాపింగ్ మాల్ నుంచి ఇంటి వరకు ఆమెను ఫాలో అవుతూ మాట్లాడే ప్రయత్నం చేశాడట. అతను మళ్లీ సినీ ఫంక్షన్లో ప్రత్యక్షమై సెల్ఫీ తీసుకునే ప్రయత్నం చేయడం ప్రియాంక మోహన్‌కు కోపాన్ని తెప్పించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఇటీవల తెలుగులో ‘సరిపోదా శనివారం’ చిత్రంతో మంచి విజయాన్ని దక్కించుకుంది ప్రియాంక అరుళ్ మోహన్.