Priyanka arul mohan | ఓజీ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రియాంక అరుళ్ మోహన్ తాజాగా చేదు అనుభవాన్ని ఎదుర్కొంది. ఇటీవల పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌తో కలిసి నటించిన ఓజీ చిత్రం ఘనవిజయం సాధించడంతో ఈ చెన్నై బ్యూటీకి తెలుగులో అవకాశాల పరంపర మొదలైందనుకుంటుండగానే, ఆమెకు సోషల్ మీడియా నుంచి తీవ్ర అసహనాన్ని కలిగించే షాక్ తగిలింది. ప్రియాంక మోహన్ పేరుతో ఇటీవల సోషల్ మీడియాలో కొన్ని ఫేక్ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. వాటిలో ఆమె అసభ్యంగాకనిపించడంతో కొందరు ఆ ఫోటోలు నిజమైనవిగా భావించి విమర్శలు చేశారు. బాగా తెలిసిన వారు మాత్రం ఫేక్ అని కొట్టిపారేశారు. ఈ వ్యవహారం ప్రియాంక దృష్టికి వెళ్లిన తర్వాత, ఆమె తన X (ట్విట్టర్) అకౌంట్లో ఒక స్పష్టమైన మెసేజ్ పెట్టింది.
ఏఐ టెక్నాలజీ ద్వారా నన్ను తప్పుగా చూపించేలా రూపొందించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దయచేసి ఇలాంటి ఫేక్ ఫోటోల్ని షేర్ చేయడం మానేయండి. ఏఐను మనకు ఉపయోగపడే మంచి మార్గాల్లో వాడుకుందాం. ఇతరులను బాధ పెట్టే విధంగా వినియోగించడం తప్పు అని కామెంట్ చేసింది. ప్రియాంక స్పందనపై నెటిజన్లు కూడా పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ఆమెకు మద్దతుగా నిలుస్తూ, ఇలాంటి ఫేక్ ఫోటోలు సృష్టించే వారికి కఠిన శిక్షలు విధించాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. ‘‘వీరికి నైతిక బాధ్యత అనే భావన లేదా?’’, ‘‘పబ్లిక్ ఫిగర్స్‌కి ప్రైవసీ ఉండదా?’’ అంటూ సోషల్ మీడియాలో వేదికగా చర్చలు జోరుగా సాగుతున్నాయి.
ఈ ఘటనతో, ఏఐ టెక్నాలజీ ఉపయోగాలు మరియు దుర్వినియోగంపై మరోసారి చర్చ మొదలైంది. మహిళా సెలెబ్రిటీలను టార్గెట్ చేస్తూ డీప్‌ఫేక్ కంటెంట్ సృష్టించే ట్రెండ్ ప్రమాదకరంగా మారుతోందని వారు సూచిస్తున్నారు. ప్రస్తుతం ప్రియాంక మోహన్ తెలుగు, తమిళ చిత్రాల్లో వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఓజీ విజయంతో ఆమెకు టాలీవుడ్లో హవా పెరిగింది. త్వరలోనే ఆమె తదుపరి సినిమా అనౌన్స్మెంట్ త్వరలోనే వెలువడనుంది.