‘ప్రేమ రెండు రకాలుగా అర్థమవుతుంది. మన కవులు, దర్శకులు చెప్పిన థియరీ ప్రకారం అది ఒకలా అర్థమైతే.. ప్రేమలో ఉన్నప్పుడు, అది విఫలమైనప్పుడు, పెళ్లయ్యాక మరోలా అర్థమవుతుంది. నిజానికి ప్రేమ అంటే ఓ అప్లికేషన్. అది ఎక్కువసార్లు పెళ్లి ద్వారానే అర్థమవుతుంది.’ అని హీరో ప్రియదర్శి అన్నారు. ఆయన, ఆనంది జంటగా నటించిన రొమాంటిక్ లవ్‌స్టోరీ ‘ప్రేమంటే’. నవనీత్ శ్రీరామ్ దర్శకుడు. పుస్కూర్ రామ్మోహన్రావు, జాన్వీ నారంగ్ నిర్మాతలు. శుక్రవారం సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రియదర్శి గురువారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. ‘సినిమా బాగా వచ్చింది. చూసినవారంతా మెచ్చుకున్నారు. ఇష్టపడి పెళ్లాడిన తర్వాత మొదలయ్యే జీవితంలో చాలా డైనమిక్స్ మారుతాయి. ప్రేమంటే ఇంత బావుంటుందా? అనుకోవడంతోపాటు ఇలా కూడా ఉంటుందా? అనిపిస్తుంది జీవితం.
దాన్నే తెరపై చూపించాం. ప్రేమించి పెళ్లాడిన జంట కలిసి చేసే ప్రయాణంలో ఎత్తుపల్లాలు.. కుదుపులు.. ఆటుపోట్లు సర్వసాధారణం. అందులో ఓ వినోదం కూడా ఉంటుంది. ఆ వినోదాన్నే ఈ సినిమాలో ఎక్స్పీరియన్స్ చేస్తారు. అలాగే సందేశాన్ని కూడా తీసుకోవచ్చు.’ అని పేర్కొన్నారు ప్రియదర్శి. ఆనంది అద్భుతమైన నటి అని, అలాగే సుమ లాంటి టాప్ యాంకర్ని యాక్టర్‌గా చూడటం ఓ గొప్ప అనుభవమని, దర్శకుడు నవనీత్ క్లారిటీతో, మెచ్యూరిటీతో సినిమా తీశాడని ప్రియదర్శి తెలిపారు. చేయబోతున్న సినిమాల గురించి చెబుతూ ‘ ‘అసమర్ధుడు’ అనే సినిమా చేస్తున్నా. ఇది పొలిటికల్ థ్రిల్లర్. అలాగే థ్రిల్లర్ జోనర్లో ‘సుయోధన’ అనే సినిమా చేస్తున్నా.’ ఆ సినిమాలకు సంబంధించిన వివరాలు త్వరలోనే తెలియజేస్తాం.’ అని చెప్పారు ప్రియదర్శి.