Suyodhana | ప్రజ్వలా లైన్ క్రియేషన్స్ బ్యానర్‌పై బోసుబాబు నిడుమోలు నిర్మించిన వినూత్న చిత్రం ‘సుయోధన’ విడుదలకు సిద్ధమైంది. వై ఎస్ మాధవ్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో వెర్సటైల్ యాక్టర్ ప్రియదర్శి, ద్రిషిక చందర్ హీరో హీరోయిన్లుగా నటించగా, డైలాగ్ కింగ్ సాయి కుమార్ మరియు సీనియర్ నటి ప్రేమ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. శ్రీ లక్ష్మి పిక్చర్స్ సంస్థ ద్వారా ఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతున్న సందర్భంగా, హైదరాబాద్‌లో చిత్ర యూనిట్ ఘనంగా ప్రీ-రిలీజ్ ప్రెస్ మీట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో చిత్ర బృందం సినిమా విశేషాలను పంచుకుంటూ, ప్రేక్షకులలో అంచనాలను భారీగా పెంచింది.
ఈ సందర్భంగా హీరో ప్రియదర్శి మాట్లాడుతూ, తాను చేసే ప్రతి సినిమా ప్రేక్షకులకు మరింత దగ్గరవ్వాలనే తాపత్రయపడతానని, ‘సుయోధన’ కథ విన్నప్పుడే ఇందులో ఏదో కొత్తదనం ఉందనిపించిందని తెలిపారు. ఈ చిత్రంలో తాను ‘ఫోలే ఆర్టిస్ట్’ (సౌండ్ ఎఫెక్ట్స్ క్రియేటర్) పాత్రలో కనిపిస్తానని, ఈ సినిమా కోసం ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నానని చెప్పారు. సాయి కుమార్ గారు సుయోధన పాత్రకు ప్రాణం పోశారని, ఆయన కాకుండా ఆ పాత్రకు మరెవరూ సెట్ అవ్వరని కొనియాడారు. హాలీవుడ్ క్లాసిక్ ‘డ్యూన్’ తరహాలో అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ఈ సినిమాను రూపొందించారని, ప్రేక్షకుల ఊహకు అందని ట్విస్టులతో సినిమా ఆకట్టుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.
డైలాగ్ కింగ్ సాయి కుమార్ మాట్లాడుతూ, తన 11 ఏళ్ల వయసులో నాటకంలో దుర్యోధనుడిగా నటించిన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. మళ్లీ ఇన్నాళ్లకు ఈ చిత్రంలో ‘సుయోధన’ అనే పవర్ఫుల్ పాత్రను పోషించడం సంతోషంగా ఉందన్నారు. నెక్స్ట్ ఏం జరుగుతుందనే ఉత్కంఠను రేకెత్తించేలా దర్శకుడు మాధవ్ రెడ్డి ఈ కథను మలిచారని, ప్రియదర్శికి ఉన్న క్రేజ్ ఈ సినిమాకు పెద్ద ప్లస్ అవుతుందని పేర్కొన్నారు. దర్శకుడు వై ఎస్ మాధవ్ రెడ్డి మాట్లాడుతూ, తాను దర్శకుడు సుకుమార్ గారి ‘1 నేనొక్కడినే’ సినిమా స్ఫూర్తితో ఈ కథను రాసుకున్నానని తెలిపారు. సౌండ్ అనేది ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తుందని, బడ్జెట్ పరిమితులు ఉన్నప్పటికీ ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మ కడలి అద్భుతమైన సెట్టింగ్స్ వేసి సినిమా స్థాయిని పెంచారని చెప్పారు.
నిర్మాత బోసుబాబు నిడుమోలు మాట్లాడుతూ, సాంకేతిక నిపుణులే ఈ సినిమాకు వెన్నెముక అని ప్రశంసించారు. ఎడిటర్ ఛోటా కె ప్రసాద్ గారు ఎడిటింగ్‌తో పాటు సినిమా నిర్మాణంలోని ప్రతి దశలోనూ అండగా నిలిచారని కృతజ్ఞతలు తెలిపారు. హీరోయిన్ ద్రిషిక చందర్ తను పోషించిన ‘సుమిత’ పాత్ర అందరికీ నచ్చుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. డిస్ట్రిబ్యూటర్ బాపిరాజు మాట్లాడుతూ, గతంలో ప్రియదర్శి నటించిన ‘బలగం’, ‘కోర్ట్’ సినిమాలు సాధించిన వసూళ్లను ‘సుయోధన’ మించిపోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మ కడలి, మ్యూజిక్ డైరెక్టర్ జై క్రిష్, నటుడు దేవిప్రసాద్ తదితరులు పాల్గొన్న ఈ వేడుక అత్యంత ఉత్సాహంగా సాగింది. శ్రీరామ నవమి కానుకగా వస్తున్న ఈ సస్పెన్స్ థ్రిల్లర్‌ను ప్రేక్షకులు ఆదరించాలని చిత్ర యూనిట్ కోరింది.