Prithviraj sukumaran | ప్రస్తుతం మలయాళ సినిమాలు అన్ని భాషలలో సత్తా చాటుతున్న విషయం తెలిసిందే. మలయాళ సినిమాలు ఓటీటీలో తెలుగు ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్నాయి. అయితే ఈ సినిమాలని పలు వివాదాలు కూడా చుట్టు ముడుతున్నాయి. అయితే మోహన్‌లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్షన్లో తెరకెక్కిన ‘ఎల్2: ఎంపురాన్’ మూవీపై వివాదాలు చుట్టుముడుతున్నాయి. మార్చి 27న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా రెండ్రోజుల్లోనే రూ.100కోట్ల కలెక్ట్ చేసి మరోసారి మలయాళ మూవీ క్రేజ్ ఏంటో నిరూపించింది. అయితే ఈ చిత్రంలో హిందువులను కించపరిచేలా సన్నివేశాలు ఉన్నాయంటూ ఆర్ఎస్ఎస్ సహా పలువురు విమర్శిస్తున్నారు.
దీనిపై ఇప్పటికే హీరో మోహన్‌లాల్ క్షమాపణలు చెప్పారు. తాజాగా దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ తల్లి, నటి మల్లిక ఈ వివాదంపై స్పందించారు. తన కుమారుడు ఎవరినీ మోసం చేయలేదని.. కావాలనే అతడిని బలిపశువును చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ మల్లిక మండిపడ్డారు.తెర వెనక ఏం జరిగిందో నాకు తెలుసు. నా బిడ్డని అన్యాయంగా నిందిస్తున్నారు. మోహన్‌లాల్, చిత్ర నిర్మాతలు ఎవరూ తమను పృథ్వీరాజ్ మోసం చేశాడని చెప్పలేదు. ఇప్పుడు ఆయనకు, నిర్మాతలకు తెలియకుండా కొందరు నా కుమారుడిని బలిపశువును చేయడానికి ప్రయత్నిస్తున్నారు అని రాసుకొచ్చారు. మోహన్‌లాల్‌కు తెలియకుండా ఇందులో కొన్ని సన్నివేశాలు జోడించారంటూ వస్తోన్న వార్తల్లో నిజం లేదు. ఆయన కూడా సినిమాను చూశారు. నా కుమారుడు ఎప్పుడూ ఎవరి వ్యక్తిగత నమ్మకాలను వ్యతిరేకించలేదు.’ అని మల్లిక ప్రశ్నించారు.
పృథ్వీరాజ్ మోసం చేశాడని మోహన్‌లాల్ గానీ, చిత్ర నిర్మాతలు గానీ ఎవరూ చెప్పనప్పుడు బయటికి వారికి ఏం సంబంధం. మోహన్‌లాల్ నాకు ఎప్పటినుంచో తెలుసు. నాకు తమ్ముడులాంటి వారు. ఎన్నో సందర్బాల్లో పృథ్వీరాజ్‌ని ప్రోత్సహించాడు. ఇప్పుడు మోహన్‌లాల్‌కు, నిర్మాతలకు తెలియకుండా నా కొడుకును బలిపశువును చేయాలని కొందరు చూస్తున్నారు’ అన్నారు మల్లిక. ఇక మోహన్ లాల్ కూడా ఈ వివాదంపై స్పందిస్తూ క్షమాపణలు తెలియజేశారు. ‘ఎంపురాన్’ చిత్రంలోని కొన్ని రాజకీయ, సామాజిక ఇతివృత్తాలు చాలా మందికి తీవ్ర బాధను కలిగించాయని నేను తెలిసింది. నా సినిమాల్లో ఏ రాజకీయ ఉద్యమం, భావజాలం లేదా మతపరమైన సమూహం పట్ల ద్వేషం ఉండకుండా చూసుకోవడం ఒక నటుడిగా నా కర్తవ్యం. అలాంటి అంశాలను సినిమా నుండి ఖచ్చితంగా తొలగించాలని మేము కలిసి నిర్ణయించుకున్నాము. మీ ప్రేమ, నమ్మకమే నా బలం” అని మోహన్ లాల్ రాసుకొచ్చారు.