Prime Video | ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో తన సబ్స్క్రైబర్ల కోసం కళ్లు చెదిరే భారీ అప్డేట్ను ప్రకటించింది. ముంబై వేదికగా గురువారం నిర్వహించిన ‘Prime Video Presents | It Starts Here 2026’ గ్రాండ్ ఈవెంట్లో ఏకంగా 55 కొత్త సినిమాలు మరియు వెబ్ సిరీస్‌లను అనౌన్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.
ముఖ్యంగా తెలుగు మార్కెట్‌పై ప్రత్యేక దృష్టి సారించిన ప్రైమ్ వీడియో, మన ప్రేక్షకులను అలరించేందుకు భారీ పెట్టుబడులతో క్రేజీ ప్రాజెక్ట్‌లను సిద్ధం చేసింది. ‘హనుమాన్’ స్టార్ తేజ సజ్జా హోస్ట్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ హిట్ రియాలిటీ షో ‘ది ట్రైటర్స్’ ఇప్పుడు తెలుగులోకి వస్తుండటం విశేషం, ఇందులో 20 మంది సెలబ్రిటీలు పాల్గొనబోతున్నారు. ఇదే కాకుండా యంగ్ హీరో కిరణ్ అబ్బవరం డిజిటల్ ఎంట్రీ ఇస్తున్న ‘గువ్వల చెరువు ఘాట్’ వెబ్ సిరీస్‌ను భరత్ కమ్మ దర్శకత్వంలో తిరువీర్, సంయుక్త మీనన్ కీలక పాత్రలతో రూపొందిస్తున్నారు. పీరియాడిక్ క్రైమ్ డ్రామాగా వస్తున్న ‘ఇసాకపట్నం’లో ఐశ్వర్య రాజేష్, సముద్రఖని నటిస్తుండగా, వీటితో పాటు ‘జగమే సంగీతం’, ‘గల్లీ’ వంటి సరికొత్త షోలు మరియు ‘ఇన్స్పెక్టర్ రిషి సీజన్ 2’ కూడా తెలుగులో సందడి చేయనున్నాయి.
సీక్వెల్స్ విషయానికి వస్తే, ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ‘మీర్జాపూర్’ను ఈసారి ఫీచర్ ఫిలిం రూపంలో థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు. అలాగే షాహిద్ కపూర్, విజయ్ సేతుపతిల ‘ఫర్జీ సీజన్ 2’, జితేంద్ర కుమార్ ‘పంచాయత్ సీజన్ 5’, అడివి శేష్ స్పై థ్రిల్లర్ ‘గూఢచారి 2 (G2)’ వంటి బ్లాక్‌బస్టర్ సిరీస్‌లు త్వరలోనే ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానున్నాయి. బాలీవుడ్ నుంచి విజయ్ వర్మ ‘మట్కా కింగ్’, ఇండియన్ సూపర్‌హీరో సిరీస్ ‘వాన్ష్ – ది కలియుగ వారియర్స్’, భూవన్ బామ్ నటిస్తున్న ‘ది రెవల్యూషనరీస్’, హృతిక్ రోషన్ నిర్మాణంలో వస్తున్న ‘స్టార్మ్ (Storm)’ వంటి ప్రతిష్టాత్మక చిత్రాలు ఈ లైనప్‌లో ఉన్నాయి. క్రైమ్, థ్రిల్లర్, కామెడీ మరియు సూపర్‌హీరో వంటి విభిన్న జోనర్లలో రాబోతున్న ఈ 55 ప్రాజెక్ట్‌లతో 2026 సంవత్సరం ఓటీటీ ప్రియులకు అసలైన సినిమా జాతరను తలపించబోతోంది.