ప్రస్తుతం మూడు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు అగ్ర కథానాయకుడు చిరంజీవి. తాజాగా ఆయన మరో సినిమాకు అంగీకరించారు. యువ దర్శకుడు వెంకీ కుడుముల (‘ఛలో’ ‘భీష్మ’ ఫేమ్) డైరెక్షన్లో చిరంజీవి ఓ చిత్రాన్ని చేయబోతున్నారు. ‘చిరు 156’ (వర్కింగ్ టైటిల్) పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మించనున్నారు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. ‘మా కల నిజమైంది. మెగాస్టార్ మా సంస్థలో సినిమా చేయడం ఆనందంగా ఉంది. డా॥ మాధవి రాజు సహనిర్మాతగా వ్యవహరిస్తారు. త్వరలో చిత్రాన్ని ప్రారంభిస్తాం’ అని డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ట్విట్టర్లో పేర్కొంది. చిరంజీవిగారితో సినిమా చేయడం జీవితకాలంలో ఒక్కసారి వచ్చే అవకాశమని దర్శకుడు వెంకీ కుడుముల ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం చిరంజీవి ‘ఆచార్య’ ‘గాడ్‌ఫాదర్’ ‘భోళాశంకర్’ చిత్రాలతో పాటు కె.ఎస్. రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు.