ఎట్టకేలకు అల్లు అర్జున్, సుకుమార్‌ల మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘పుష్ప 2’కు సంబంధించిన తొలి ప్రెస్‌మీట్ గురువారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సమావేశంలో మైత్రీ అధినేతలు నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్‌లతో పాటు ఈ సినిమాను దేశవ్యాప్తంగా పంపిణీ చేస్తున్న డిస్ట్రిబ్యూటర్లు కూడా పాల్గొన్నారు. ‘పుష్ప 2’ను మొదట ప్రకటించినట్టు డిసెంబర్ 6న కాకుండా, ఒకరోజు ముందుగానే.. అంటే.. డిసెంబర్ 5న విడుదల చేయనున్నట్టు ఈ సమావేశంలో నిర్మాతలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ‘హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ రాత్రింబవళ్లూ కష్టపడి ఈ సినిమాకోసం పనిచేస్తున్నారు. బన్నీ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇందులో చూస్తారు. అన్ని లక్ష్యాలనూ మా ‘పుష్ప-2’ అధిగమిస్తుంది. యూఎస్‌లోనూ, ఇక్కడా లాంగ్ వీకెండ్ కలిసొస్తుందనే ఉద్దేశంతోనే ఒకరోజు ముందుగా విడుదల చేస్తున్నాం. అయినా పుష్పరాజ్ ఎప్పుడొస్తే అప్పుడే పండగ’ అని నిర్మాతలు ధీమా వ్యక్తం చేశారు. ఇంకా హిందీలో విడుదల చేస్తున్న అనిల్ తడానీ, వెస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్ ఎల్వీఆర్, తమిళంలో విడుదల చేస్తున్న ఏజీఎస్ డిస్ట్రిబ్యూటర్ మాలి, మలయాళ పంపిణీదారులు ముకేశ్ మెహతా, కర్ణాటక డిస్ట్రిబ్యూటర్ లక్ష్మీకాంత్ రెడ్డితోపాటు నైజాంలో రిలీజ్ చేస్తున్న మైత్రీ డిస్ట్రిబ్యూటర్ శశి కూడా మాట్లాడారు.