యామిన్రాజ్, కార్తీక్ జయంత్, ప్రియాంక ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ప్రేమదేశపు యువరాణి’. సునీల్ నిమ్మల దర్శకుడు. ఆనంద్ వేమూరి, హరిప్రసాద్ నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ ‘లవ్, కామెడీ అంశాలు కలబోతగా ప్రతీకార నేపథ్యంలో సాగే చిత్రమిది. కథానుగుణంగా అద్భుతమైన ఐదు పాటలు కుదిరాయి.
త్వరలో విడుదల చేస్తాం’ అన్నారు. ‘టైటిల్‌కు మంచి స్పందన వస్తున్నది. వినోదంతో పాటు థ్రిల్లింగ్ అంశాలుంటాయి. ఆర్.పి.పట్నాయక్ సోదరుడు అజయ్ పట్నాయక్ అందించిన సంగీతం మెలోడీ ప్రధానంగా ఆకట్టుకుంటుంది. ఈ నెలాఖరులో ఆడియో విడుదల చేస్తాం’ అని దర్శకుడు చెప్పారు. సందీప్, రాజారెడ్డి, పవన్, యోగి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: శివకుమార్ దేవరకొండ, సంగీతం: అజయ్ పట్నాయక్. రచన-దర్శకత్వం: సాయి సునీల్ నిమ్మల.