Vaibhav Suryavanshi | ఐపీఎల్ 2025 సీజన్‌కు సంబంధించి రాజస్థాన్ రాయల్స్ యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీని తాను కౌగిలించుకున్నట్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న మార్ఫింగ్ ఫోటోలపై బాలీవుడ్ నటి, పంజాబ్ కింగ్స్ సహ యజమాని ప్రీతి జింటా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఫోటోలు పూర్తిగా ఫేక్ అని, వార్తా ఛానెళ్లు కూడా ఇలాంటి తప్పుడు చిత్రాలను ప్రసారం చేయడం ఆశ్చర్యకరమని ఆమె మండిపడ్డారు.
మే 17న పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ తర్వాత ప్రీతి జింటా, వైభవ్ సూర్యవంశీ కలుసుకున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. అసలు వీడియోలో ప్రీతి జింటా వైభవ్‌తో కరచాలనం చేసి, కాసేపు మాట్లాడారు. అయితే, కొందరు ఆకతాయిలు ఈ వీడియోను మార్ఫింగ్ చేసి, ప్రీతి జింటా వైభవ్‌ను కౌగిలించుకున్నట్లు తప్పుడు చిత్రాలను సృష్టించి విస్తృతంగా ప్రచారం చేశారు.
తాజాగా ఈ మార్ఫింగ్ ఫోటోలపై ప్రీతి జింటా తన ఎక్స్ ఖాతా ద్వారా స్పందించింది. “ఇది మార్ఫింగ్ చేయబడిన చిత్రం మరియు తప్పుడు వార్త. ఇప్పుడు వార్తా ఛానెళ్లు కూడా మార్ఫింగ్ చిత్రాలను ఉపయోగించి వార్తలుగా ప్రసారం చేయడం నాకు ఆశ్చర్యంగా ఉంది! అని ఆమె పోస్ట్ చేశారు. మీడియా సంస్థలు వార్తలను ప్రసారం చేసే ముందు వాస్తవాలను తెలుసుకోవాలని ఆమె సూచించారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ప్రీతి జింటా అభిమానులకు విజ్ఞప్తి చేశారు.
Fake news with morphed image.
— Preity G Zinta (@realpreityzinta) May 20, 2025