Peddi | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన ‘పెద్ది’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. జూన్ 4న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు సాధిస్తూ రామ్ చరణ్ కెరీర్లోనే అత్యంత విజయవంతమైన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. సుమారు రూ.400 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించిన ఈ చిత్రం ప్రస్తుతం విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.సినిమా సాధించిన ఈ అద్భుత విజయాన్ని పురస్కరించుకుని చిత్రబృందం హైదరాబాద్‌లో ‘పెద్ది మెగా బ్లాక్‌బస్టర్ ఈవెంట్’ను ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే దర్శకులు సుకుమార్, అనిల్ రావిపూడి, హీరో రామ్ చరణ్‌తో పాటు చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.
అయితే ఈ విజయోత్సవ వేడుకల మధ్య ‘పెద్ది’ టీమ్ చేసిన ఒక ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు అందరి ప్రశంసలు అందుకుంటోంది. సినిమా ద్వారా వచ్చిన ఆనందాన్ని కేవలం అభిమానులతో మాత్రమే కాకుండా అనాథాశ్రమాల్లోని చిన్నారులతో కూడా పంచుకోవాలని చిత్రబృందం నిర్ణయించింది. ‘పెద్ది’ సినిమాలో రామ్ చరణ్ ఉపయోగించిన క్రికెట్ బ్యాట్‌కు ప్రత్యేకమైన గుర్తింపు లభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అదే డిజైన్‌తో ప్రత్యేకంగా కొన్ని రెప్లికా బ్యాట్లను తయారు చేయించారు. అంతేకాదు, ఆ బ్యాట్లపై స్వయంగా రామ్ చరణ్ సంతకాలు చేయడం విశేషం.
రామ్ చరణ్ సంతకం చేసిన ఈ ప్రత్యేక క్రికెట్ బ్యాట్లను అనాథాశ్రమాల్లోని చిన్నారులకు బహుమతిగా అందజేశారు. తమ అభిమాన హీరో సంతకం చేసిన బ్యాట్లను చేతిలోకి తీసుకున్న చిన్నారులు ఆనందంతో మురిసిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.ఈ ప్రత్యేక బ్యాట్లను ‘పెద్ది’ చిత్ర ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్ల ప్రత్యేకంగా రూపొందించారు. సినిమా కోసం రూపొందించిన ఒరిజినల్ బ్యాట్ డిజైన్‌ను అలాగే కొనసాగిస్తూ, అనాథ పిల్లలకు బహుమతిగా అందించేందుకు అదనంగా మరిన్ని బ్యాట్లను తయారు చేశారు. చిత్రబృందం అభ్యర్థన మేరకు ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంపై సోషల్ మీడియాలో అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. సినిమా విజయాన్ని సమాజంతో పంచుకోవడం, ముఖ్యంగా చిన్నారుల ముఖాల్లో చిరునవ్వులు తీసుకురావడం నిజంగా అభినందనీయమని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.