‘సినిమా మెప్పిస్తుందనే నమ్మకంతోనే ట్రైలర్లోనే కథను చెప్పేశాం’ అంటున్నారు లంకా ప్రతీక్ ప్రేమ్‌కుమార్. ఆయన హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘సదా నన్ను నడిపే’. వైష్ణవి పట్వర్దన్ నాయికగా నటించింది. లంకా కరుణాకర్ దాస్ నిర్మాత. ఈ నెల 24న సినిమా విడుదలకు సిద్ధమవుతున్నది. తాజా ఇంటర్వ్యూలో చిత్ర విశేషాలు తెలిపారు హీరో, దర్శకుడు లంకా ప్రతీక్ ప్రేమ్ కుమార్. ఆయన మాట్లాడుతూ…‘హీరోగా ఇది నా రెండో సినిమా. కొత్తగా ఇండస్ట్రీకి వచ్చే వాళ్ల మాటలు ఎవరూ వినరు.
దాంతో నాకు కావాల్సిన ఔట్పుట్ కోసం హీరో, నిర్మాత, దర్శకత్వంతో పాటు నేపథ్య సంగీత బాధ్యతలు కూడా తీసుకున్నా. అరుదైన వ్యాధితో జీవితం చివరి దశలో ఉన్న అమ్మాయి, ఒక మాస్ అబ్బాయి మధ్య ప్రేమకథ ఇదని ట్రైలర్లోనే చెప్పేశాం. కథ బయటకు వెల్లడించినా థియేటర్లో మిమ్మల్ని మెప్పించగలమనే నమ్మకం ఉంది. ఈ కథ విని చాలా మంది ‘గీతాంజలి’లా ఉంటుందా అని అడుగుతున్నారు. ఆ లైన్ వరకే ‘గీతాంజలి’ అనుకుంటారు. మిగతా సినిమా అంతా కొత్తగా ఉంటుంది. ప్రస్తుతం ఒక వెబ్ సిరీస్ రూపొందిస్తున్నా, మరో వెబ్ సిరీస్‌కు సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు.